ఢిల్లీ : మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుపై లోక్ సభలో నేడు చర్చ ప్రారంభమైంది. ఈ బిల్లుపై చర్చకు 7 గంటలు కేటాయించినట్లు తెలుస్తుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (128 సవరణ) బిల్లు-2023ని లోక్‌సభలో పరిశీలన మరియు ఆమోదం కోసం సభ ముందు పెట్టి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు మహిళల గౌరవం మరియు అవకాశాల సమానత్వాన్ని పెంచుతుందన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తుందని, దీనిలో నాలుగు ముఖ్యమైన క్లాజులు ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. గతంలో ఈ బిల్లును అడ్డుకున్నారని అన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారని తెలిపారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సబ్ క్లాజ్‌తో కూడిన బిల్లును వెంటనే అమలు చేయాలని ఆమె అన్నారు.
డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి మాట్లాడేందుకు సిద్ధమవ్వగా కొందరు ఎంపీలు నినాదాలు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఆమె నిరసన వ్యక్తం చేయగా, ఆమెకు ఎంపీలు మద్దతుగా నిలబడి 'ఇదేనా మహిళలకు మీరిచ్చే మర్యాదా?' అని మండిపడ్డారు. మహిళా కోటా బిల్లు అమలును డీలిమిటేషన్‌తో ఎందుకు లింక్ చేశారని కనిమొళి ప్రశ్నించారు.










