-బిజెపికి ఒక్క ఓటు వేసినా చేటే
-రాష్ట్ర మహిళా సదస్సులో మరియం థావలే
ప్రజాశక్తి-తిరుపతి సిటీ:'సనాతన ధర్మం పేరిట అణచివేతకు గురిచేస్తూ, అశాస్త్రీయ భావజాలాన్ని రుద్దుతూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తోన్న బిజెపికి 2024 ఎన్నికల్లో తిరుపతిలోనే కాదు... ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఒక్క ఓటు కూడా వేయొద్దు' అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మరియం థావలే పిలుపునిచ్చారు. 'అసమానతలు లేని అభివృద్ధి' నినాదంతో తిరుపతిలోని టిఎంఆర్ కల్యాణ మండపంలో శనివారం రాష్ట్ర మహిళా సదస్సు జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.సాయిలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మరియం థావలే మాట్లాడుతూ పాలకుల తీరుతో 76 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో ఆకలి, ఉపాధి కోసం అల్లాడే పరిస్థితి నేటికీ ఉందన్నారు. దేశంలో అధిక భాగం ఆకలితో అలమటిస్తున్నారని, గతంలో 107వ స్థానంలో ఉన్న ఆకలి సూచి ఇప్పుడు 111వ స్థానానికి దిగజారిందని తెలిపారు. మహిళలను ఉన్నత విద్యవైపు వెళ్లనీయకుండా చేసే కుట్ర నూతన విద్యా విధానంలో దాగి ఉందని విమర్శించారు. సాక్షాత్తు ప్రధాని మంత్రి మోడీ దేశ ప్రజలను మూఢనమ్మకాలు, అశాస్త్రీయ విధానాల వైపు మళ్లించాలని చూస్తున్నారని, కరోనా సందర్భంగా ఆయన వ్యవహరించినతీరే ఇందుకు నిదర్శమని ఉదాహరించారు. దేశ సంపదను తన స్నేహితుడైన అదానీకి అప్పగిస్తున్నారని, మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత శతకోటీశ్వరులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని తెలిపారు. విజయమాల్యా లాంటి వ్యక్తులు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొడుతుంటే వారిపట్ల బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని కోరితే పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేస్తోన్న పోరాటాన్ని ప్రశంసించారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో మహిళలపై దాడులు అధికమయ్యాయని, హాత్రాస్ ఘటనలో నిందితులకు సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ సిఎం ఆదిత్య యోగినాథ్ వంతపాడారని, అగ్రకుల పెత్తందార్లకు అండగా నిలబడ్డారని అన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయమంత్రి బ్రిజ్‌భూషణ్‌పై కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. మణిపూర్‌లో జరిగిన మారణహోమం, అమానుష ఘటన విషయంలోనూ అక్కడి సిఎంను మోడీ వెనకేసుకురావడాన్ని బట్టి మహిళల పట్ల బిజెపి వైఖరి తేటతెల్లమవుతోందన్నారు. ప్రస్తుతం రాజ్యాంగం, మనుస్మృతి మధ్య యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలను అణచివేసే మనుస్మృతిని వ్యతిరేకిద్దామని, సవాళ్లను ఎదుర్కొని సమానత్వాన్ని సాధిద్దామని, 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ హఠావో, మహిళా బచావో, దేశ్‌కో బచావో అని నినదించారు.
సామాజక కార్యకర్త కె.వసుంధర మాట్లాడుతూ మహిళా సాధికారిత గురించి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ మాట్లాడుతూనే ఉన్నా ఇప్పటికీ సాధించలేదన్నారు. మహిళలను ఓటు బ్యాంకుగా మారుస్తూ విద్య, వైద్యం, అధికారానికి దూరం చేసి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటూ కట్టుబాట్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మతం ముసుగులో మహిళలను ఆటవిక నాగరికత కంటే దారుణంగా అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మహిళల పక్షాన వామపక్ష పార్టీలు పోరాడుతుండడం హర్షణీయమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర మహిళలు తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న నీచరాజకీయాలు రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. ప్రజలను చైతన్యపరచి మహిళా శక్తి ఏంటో బూర్జువా రాజకీయ నాయకులకు చూపాలని కోరారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ, మూలం రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ధనలక్ష్మి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, పి.మురళి, రాయపనేని హరికృష్ణ, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పాల్గొన్నారు.