Oct 15,2023 06:57

'పల్లెలు దేశానికే పట్టుకొమ్మలు' అన్నారు గాంధీ. ఆ పల్లెల్లో స్త్రీ భాగస్వామ్యం లేకపోతే పరిపూర్ణం కాదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా, చంద్ర మండలంలోకి వెళ్లి వస్తున్నా.. సమాజంలో సగంగా ఉండి, పురుషుల శ్రమకు జోడయితేనే అభివృద్ధి సాధ్యం. అమాయకత్వం.. ఐక్యమత్యం.. ఆలోచనాతత్వం కలగలిసినదే గ్రామీణ మహిళల శ్రమైక జీవన సౌందర్యం. ఉత్పత్తిలో.. ఆర్థికాభివృద్ధిలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం సగానికిపైనే. అలాంటి ఆ గ్రామీణ మహిళల జీవనం నల్లేరు మీద నడకలా ఏమీ లేదు.. వారి జీవన గమనంలో.. ముళ్లు.. రాళ్లు.. ఉన్నాయి. అవి తీయాల్సిన బాధ్యత పాలకులదే. నేడు 'అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం' సందర్భంగా.. ఆ పల్లెపడుచుల గురించి ప్రత్యేక కథనం..
ప్రపంచమంతా కుగ్రామమైన రోజుల్లోనూ.. పల్లె.. ఆ గ్రామీణ వాతావరణం.. ఆహ్లాదభరితం. అలాగే మనందరికీ అవసరమైన ఆహారం గ్రామాల నుంచే ఉత్పత్తయ్యేది. ఈ క్రమంలో వ్యవసాయ పనులు అంటే అత్యధిక శ్రమ చేసేది గ్రామీణ మహిళలే.. సూర్యోదయంతో పొలాలకు పరుగులు తీసేది పల్లెపడుచులే. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టుకుని, వంట చేసి, వరి, పత్తి, శనగ, మొక్కజొన్న, మిరప పంట పొలాల్లో పనులకు వెళతారు. పదుల కిలోమీటర్ల దూరమైనా ఆటో, ట్రాక్టర్లు ఎక్కి, నానా ఇబ్బందులు పడుతూనే వ్యవసాయ పనుల్లో పాలుపంచుకుంటారు. అటువంటి వీరికి వేతన చెల్లింపుల్లో వివక్ష చూపిస్తున్నారు. పురుషులతో సమానంగా శ్రమిస్తున్నా ఇచ్చే కూలీలో అసమానతే చూపిస్తున్నారు. స్త్రీని వస్తువుగా చూస్తున్న భావజాలం గ్రామీణ ప్రాంతాల్లో అధికం. అందుకే అక్కడా ఇంటా, బయటా మహిళలు వేధింపులు, అత్యాచారాలు, హత్యాచారాలకు గురవుతుంటారు. వీటిని అరికట్టేలా స్థానిక గ్రామ పంచాయతీలు భద్రత కల్పించాలి.

international-village-women-day-special-story4
  • కుటుంబంలో నాయక..

కుటుంబంలో పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో మహిళల పాత్ర ఎక్కువ. ఇంటిపనులు చేయడం తమదే అన్నట్లు కష్టపడతారు. పట్టణాలతో పోల్చినప్పుడు పల్లెల్లో మహిళలకు పనుల్లో పురుషులు సాయం చేస్తుంటారు. అయితే అధికంగా శ్రమపడటం వల్ల మహిళలు త్వరగా అలసిపోవడం, ఎముకల అరుగుదల, తదితర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. గ్రామీణ కుటుంబాల్లో ఆధిపత్య భావజాలం ఎక్కువ. మహిళల పట్ల చులకన భావం ఉంటుంది. అయినప్పటికీ కుటుంబ సంబంధ విషయాల్లో భార్యతో సంప్రదించే సుగుణం ఉంటుంది. ఆమెకు నిర్ణయాత్మక పాత్ర కొంతమేరకైనా పట్టణ ప్రాంత మహిళలతో పోలిస్తే మెరుగనే చెప్పాలి. నీటి ఎద్దడి సమస్య గ్రామీణ ప్రాంతాలో ఎక్కువ. దీనికి ప్రధానంగా బలయ్యేది మహిళలే. కిలోమీటర్ల దూరం నడిచి బిందెలు.. బిందెలు నీళ్లు మోసుకొస్తారు. వారి శ్రమకు గుర్తింపు ఉండదు. పాలకులకు అసలే పట్టదు.

international-village-women-day-special-story4
  • పిల్లల భాధ్యత..

చంటి పిల్లల సంరక్షణ తల్లులదే. వారికొచ్చే అరకొర ఆదాయాలతో స్త్రీల పౌష్టికాహారం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా పాలిచ్చు తల్లుల్లో అది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. వీరికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అంగన్‌వాడీల ద్వారా అందించేది వారికేమాత్రం సరిపోదు. దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి.

international-village-women-day-special-story4
  • పశుపక్ష్యాదుల పోషణలో..

పశువులు, కోళ్లు పెంపకంలోనూ గ్రామీణ మహిళల పాత్ర చెప్పుకోదగ్గది. ఒక సాధారణ మహిళ తన రోజువారీ పనితో పాటు పశువులు, కోళ్ల వద్ద శుభ్రం చేయడంతో మొదలై, మేత, నీళ్లు పెట్టి, ఇంటిపనులు పూర్తి చేసుకుని, పొలాలకు వెళతారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడే పశువులకు మేత కోసుకొస్తారు. ఆవులు, గేదెలు, మేకలు ఏవున్నా.. పాలు పితికి, వాటికి మేత వేస్తారు. కోళ్లకు మేతవేసి, గూట్లో పెడతారు. ఈ పనులన్నీ వారికి అదనపు శ్రమే. ఇంటి ఆర్థిక విషయాలు పురుషుల కన్నా మహిళలే మరింత అప్రమత్తంగా ఉంటారు. సహజంగా స్త్రీలు ఆదాయం, ఖర్చులు బ్యాలెన్సు చేస్తూ ఆర్థిక సమస్యలు తలెత్తకుండా కుటుంబానికి అండగా నిలుస్తారు. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించేలా పెరిటి మొక్కలు పెంపకం పట్ల శ్రద్ధకనబరుస్తారు. వీటన్నింటి వల్ల కుటుంబాలకి అననుకూల పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇది కుటుంబం గుర్తించాలి. అలాగే పశుపోషణ అధికారిక గణాంకాల్లో వీరి శ్రమను లెక్కించాల్సి ఉంది.

international-village-women-day-special-story4
  • చేతివృత్తులు.. వృత్తిదారులు..

ఇళ్ల వద్ద ఉండే గ్రామీణ మహిళలు ఖాళీగా ఉండరు. ఏదో ఒక చేతివృత్తిని చేసుకుంటూ కుటుంబానికి తోడ్పడతారు. కొందరు మిషన్‌ కుట్టడం, డిజైనింగ్‌ చేయడం వంటివి చేస్తే, ఇంకొందరు బుట్టలు, గంపలు అల్లడం చేస్తుంటారు. ఇంకొందరు వృత్తిపరమైన పనులకు వెళ్తుంటారు. ఇలా చేతివృత్తులు.. వృత్తిదారులుగా మహిళలు భాగస్వామ్యమై ఉన్నారు.

international-village-women-day-special-story4
  • విద్య, వైద్యంలో నిర్లక్ష్యం..

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో విసిరేసినట్లుగా పాఠశాలలుంటున్నాయి. సరైన బస్సు సౌకర్యం లేనిచోట ఆడపిల్లల చదువు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోతుంది. ఫలితంగా పదో తరగతి వరకు చదువుకునే అమ్మాయిల సంఖ్య అంతమాత్రంగా ఉంటుంది. దాంతో కౌమారదశలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఆపై ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థినుల సంఖ్య గ్రామీణ భారతంలో చాలా తక్కువ. చదువులో వెనుకుబాటుతనం ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుంది. వాటిని సరైన సమయంలో గుర్తించలేకపోవడం.. గుర్తించినా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. సహజంగా గ్రామీణ కుటుంబంలో స్త్రీ తన అనారోగ్య సమస్యను వ్యక్తపరచడానికే వెనకాడుతుంది. ఇటీవల కొంత అవగాహన వస్తున్నా.. అధిక రక్తస్రావం, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు.. థైరాయిడ్‌, మధుమేహం, రక్తపోటు వంటి వాటిని ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారు. ఎక్కువమంది గ్రామీణ మహిళలు చివరిదశలోనే వైద్యులవద్దకు వెళ్తున్నారనేది నిపుణుల మాట.

 

  • మార్పు ప్రభావాలు..

కాలం మారుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా గ్లాసు మజ్జిగ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూల్‌డ్రింక్స్‌ ఇస్తున్నారు. ఆధునిక జీవనం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా వ్యాపారస్తులు వారి నట్టింట్లోకి వచ్చేస్తున్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల్లో చదివించడం కన్నా ప్రయివేటు స్కూళ్లకు పంపేందుకే ఇష్టపడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి. ఆర్థికావసరాలు, ప్రభావాలతో చిన్న కుటుంబాల ఏర్పాటు అనివార్యమవుతున్నాయి. కలిసి ఉంటే కలదు సుఖం అనేది సద్దిమూటగా ఉండిపోయింది. గ్రామీణ ప్రాంతాల సహజ స్వభావమైన ఆదుకునేతత్వం నేడు పలుచబడుతోంది. అయినా కొన్నిచోట్ల ఇంకా సజీవంగా ఉండడం వల్లే పల్లెల్లో అనుబంధాలు పరిఢవిల్లుతున్నాయి. ఊర్లోకి ఎవరొచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా పలకరించడం చేస్తారు. మేమున్నామనే భరోసాను ఇస్తారు.

  • టీవీలు.. అంతర్జాలం ప్రభావం..

మహిళలంతా ఒక దగ్గరకు చేరి పనులు చేయడం వల్ల ఒకప్పుడు వాళ్లల్లో ఐక్యత మెండుగా ఉండేది. పనిప్రదేశంలో ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే అందరూ కలిసి ఎదురు తిరిగేవారు. పనికి వెళ్లకుండా మానుకునేవారు. సాయంత్రం వేళల్లో ఒక దగ్గరకు చేరి, పాటలు పాడుకోవడం, పండగ వచ్చిందంటే కలిసికట్టుగా పిండివంటలు వండుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ ఆన్‌లైన్‌లో, షాపుల్లో దొరకడంతో వండుకోవడమూ తగ్గింది. తమ జానపద కళలను పక్కన పెట్టి, నేడు వినోదం కోసం టీవీలకు అలవాటుపడ్డారు. వాటిల్లో వచ్చే సీరియళ్ల ప్రభావం.. భావజాలపరమైన దాడి చేస్తున్నాయి. మూఢనమ్మకాలు, విశ్వాసాలను పెంచిపోషిస్తున్నాయి. గతంలో లేని ఆచారవ్యవహారాలను నేర్పుతున్నాయి. పగ, ప్రతీకారం, ఈర్ష్యా, ద్వేషాలు ప్రేరేపిస్తున్నాయి. ఇవి మహిళల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయి.
పద్మావతి
94905 59477