Nov 20,2023 07:57

'ఏమండోయ్ .. మీకో శుభవార్త !
మన అపార్ట్మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీవాళ్ళు ఈ సంవత్సరం వినాయకచవితి మహోత్సవాల్లో మీకు 'అగ్గినొప్పి' అనే పురస్కారంతో పాటు, ఘనంగా సన్మానం కూడా చేస్తారట..!' పరుగుపరుగున ఇంట్లోకి అడుగుపెడుతూ భర్తతో సంబరంగా చెప్పింది వసంతలక్ష్మి.
తన మొబైల్‌ ఫోనులో చూపుడు వేలుతో ఏకదీక్షగా అక్షరాలను సృష్టిస్తోన్న 'ప్రముఖ కవీ, ప్రఖ్యాత రచయితా, ప్రసిద్ధ గాయకుడూ..' అని, తనకుతాను పరిచయం చేసుకునే అగ్గిరాముడు, భార్య మాటలకు మొహంలో చిరునవ్వుకు బదులు కణకణమండే చింతనిప్పులనే కురిపించాడు.
'వాళ్ళిచ్చే పురస్కారం 'అగ్గినొప్పి' కాదే..! బహుశా 'అగ్గినిప్పు' అయ్యుంటుంది. ఎందుకంటే నా పేరులోనూ, కలంపేరులోనూ 'అగ్గి' ఉంది కాబట్టి..' అని ఆవేశంగా ఊగిపోతూ భార్యపై అగ్గిమీద గుగ్గిలమైపోయాడు అగ్గిరాముడు.
అగ్గిరాముడు చెప్పిన వివరణకు కంగుతిన్న వసంతలక్ష్మి 'అది నిప్పయినా, నొప్పయినా అందుకు మీరొక్కరే ఘటనాఘటనా అసమర్థులు..' అంటూ వెంటనే నాలిక కరుచుకుని, దొర్లిపోయిన ఉచ్ఛారణాదోషాన్ని సరిచేసుకుంటున్నట్లుగా 'ఆ సమర్థులు.. మీరేనండి' నెమ్మదిగా అంది వసంతలక్ష్మి, అగ్గిరాముడుకి కావలసిన విధేయతను ప్రదర్శిస్తూ.
'ఆ.. అంతా గమనిస్తున్నాను. పెరటిచెట్టు వైద్యానికి కొరగానట్టు.. నా విద్వత్తు నీకు తెలియట్లేదు. ఈ పుంభావ సరస్వతి ముందా కుప్పిగంతులూ..?!' అంటూ అగ్గిరాముడు తన గొప్పతనాన్ని గుర్తు చేస్తూ భార్య మీద కాస్త కోపాన్ని వెళ్ళగక్కాడు.
వసంతలక్ష్మి అతనికి దగ్గరగా వెళ్లి 'సో సారీ అండి.. ఒక్కోసారి పొరపాటున నిజాలు నోరు జారేస్తుంటానని మీకు తెలుసుకదా..!' నొచ్చుకున్నట్టుగా తన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ, మళ్ళీ చప్పున నాలుక కరుచుకుంది.
అప్పటికే పనిలో తలమునకలైన అగ్గిరాముడు తన చరవాణిలో సీరియస్‌గా టైప్‌ చేస్తూ కవిత్వాన్ని ఖండఖండాలుగా ఖైమా చేస్తున్నాడు. తన లోకంలో పడిపోయిన అగ్గిరాముడుకి ఆమె మాటలేవీ చెవిన పడకపోవడంతో, వసంతలక్ష్మి చిన్నగా ఊపిరి పీల్చుకుని, వంటగది వైపు చల్లగా జారుకుంది.
 

                                                                                 ***

'అగ్గిరాముడు' - గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే - అతని ఇంటిపేరు 'అగ్గి' అయితే, 'రాముడు' అతని వంటిపేరు. రాముడు అతని తాతగారి పేరు. అగ్గిరాముడికి యుక్తవయసు రాగానే గొప్ప సాహిత్యవేత్త కావాలనే కోరిక బలంగా పరవళ్ళు తొక్కింది. అనుకుందే తడవుగా పుంఖాలు పుంఖాలుగా సాహిత్యాన్ని ఏకధాటిగా గుప్పించి, అన్నిరకాల తెలుగుపత్రికల మీద ఏకధారగా ప్రవహింపజేశాడు.
అయితే ప్రయత్నా ప్రవాహం ఏ పత్రికా పేజీలపై పారలేదు. గోడకు కొట్టిన బంతుల్లా రచనలన్నీ తిరుగుటపాలో వచ్చేశాయి. అలా అతని ఆశ తీరకుండానే పెళ్లి, పెళ్ళాం, పిల్లలంటూ సంసారసాగరంలో పీకలలోతు మునిగిపోయాడు. అతనిలోని ఆ కోరిక చావకుండా ఎక్కడో కాస్త కొనఊపిరితో అలాగే ఉండిపోయింది.
తన కోరికను ఎలాగైనా సంపూర్ణంగా బతికించుకోవాలని సాహిత్యాన్ని ఉద్ధరించటం కోసం గట్టిగానే నడుం కట్టాడు. ఉద్యోగంలో ఉన్నన్ని రోజులూ రాయడంగానీ, చదవడంగానీ వీలు కుదరలేదనే వి.ఆర్‌. తీసుకున్నాడు. తను చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగానికి యుద్ధప్రాతిపదికన యాభై ఏళ్ళకే వాలంటరీ రిటైర్మెంట్‌ ప్రకటించుకున్నాడు.
పేరుకే విశ్రాంతి ఉద్యోగి అయినా, సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యేవాడిలా రోజుకి పద్దెనిమిది గంటలు అవిశ్రాంతంగా శ్రమిస్తూ కుప్పలు తెప్పలుగా కథలు, కవితలు రాసి పంపుతూనే వున్నాడు. అతని సాహిత్య సృజనకు హడలిపోయిన ఆయా పత్రికల సంపాదకులు తమ యాజమాన్యాలకు రాజీనామాలు సమర్పించి, 'బతుకుజీవుడా'ని బుర్ర చేతపట్టుకుని వేరే కొలువులు వెతుక్కున్నట్టు కొంత భోగాట్టా!
అతని రచనల తాకిడిని తట్టుకోలేక తల్లడిల్లిపోయిన చాలామంది సంపాదకుల మెదళ్లలో నరాలు చిట్లిపోయాయనీ, తత్ఫలి తంగా వారి మతులు శృతితప్పి, గతులు మార్చుకుని మానసిక ఆరోగ్య కేంద్రాల్లో చేరి, స్వస్థత కోసం నానావస్థలు పడుతున్నారనీ మరికొంత విశ్వసనీయమైన సమాచారం!
తన కాలం, కర్మం తన కలానికి కలిసిరావటం లేదని, దీర్ఘంగా ఆలోచించి, కాస్త ఆలస్యంగా గ్రహించిన అగ్గిరాముడు, ఇక లాభం లేదనుకుని 'త్రేతాగ్ని' అనే కలం పేరుతో తన కలాన్ని గట్టిగా విదిలించాడు.
అంతే- అతని అదృష్టమో, పాఠకుల పాలిట శాపమో, పాపమో అతని రచనలు అప్పుడప్పుడు అచ్చుకు నోచుకోసాగాయి. అగ్గిరాముడు అలా అందొచ్చిన ఆ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా ఎడాపెడా రాసేస్తూ, అచ్చోసిన అక్షరశిల్పిలా అమాంతం రెచ్చిపోసాగాడు.
అతనుంటోన్న అపార్ట్మెంట్‌ వాసులకు మన అగ్గిరాముడు మహా ప్రాణసంకటంగా అవతరించాడు. పనిమీద బైటకు వెళ్తోన్నవారిని నిల్చోబెట్టి, వీలయితే కూర్చోబెట్టి మరీ తను రాసింది చదివి వినిపించేస్తున్నాడు. అగ్గిరాముడు ఆ అపార్ట్మెంటు వాసుల్లో ఒక్కరినీ వదిలిపెట్టకూడదని గట్టిగానే నిశ్చయించుకుని, తన సాహితీ శరాఘాతాలను సంధిస్తూనే వున్నాడు.
సరిగ్గా అప్పుడే వాట్సప్‌ సమూహాలు ఇబ్బడిముబ్బడిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, అగ్గిరాముడి సాహిత్యం బుగ్గిపాలు కాకుండా గొడుగుపట్టాయి. ఇక మన అగ్గిరాముడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. రక్తం మరిగిన పెద్దపులిలా ఒక్కసారిగా జుట్టు విదుల్చుకుని, తన ఘంటంతోనూ, కంఠంతోనూ ఏకకాలంలో గాండ్రిస్తూ దారుణ హింసాకాండకు సిద్ధపడ్డాడు.
అగ్గిరాముడు తన చరవాణిలో స్పశించిన సృజనకు చూపుడువేలూ, బొటనవేలు మాదిరి ఉబ్బిపోయినాగానీ, తన భీభత్సమైన సాహితీ కుంభవృష్టిని కుప్పలుతెప్పలుగా ఫుల్‌ స్టాపులూ, కామాలూ లేకుండా ఏకబిగువునా కురిపిస్తూనే వున్నాడు.
వాట్సాప్‌ గ్రూపుల పుణ్యమాని అగ్గిరాముడి సాహితీ విధ్వంసం దినదిన ప్రవర్ధమానంగా మూడు కథలూ, ఆరు కవితలుగా కొనసాగిపోతోంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా తన రచనలతో అతను చేస్తోన్న డమరుక నాదానికి దద్ధరిల్లిపోయిన ఆయా వాట్సప్‌ సమూహ సభ్యులూ, పత్రికా సంపాదకులూ బాధని బొడ్లో దోపుకోలేకా, కష్టాన్ని కడుపులో కంట్రోల్‌ చేసుకోలేకా, అలాని బైటకు బావురమని ఏడ్వనూలేకా లోలోన అక్కుపక్షుల్లా బిక్కుబిక్కుమని అల్లల్లాడిపోసాగారు.
అలా నిర్దాక్షిణ్యంగా, నిస్సహాయంగా రూపుదాల్చుకున్న సాహితీవేత్తల బంగారు జీవితాలకు లంగరు వేసినట్టుగా స్తంభనకుగురై, దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగామారి, చిత్తడిచిత్తడిగా ఇత్తడైపోతున్నాయి.
అలా అగ్గిరాముడు తన అక్షరాలనే మారణాయుధాలను మలిచి, ఏకధాటిగా అస్త్రాల వర్షం కురిపిస్తోన్న ఆ దారుణ తరుణంలో అతనుంటున్న అపార్ట్మెంట్‌ వాసులూ, కమిటీవాళ్ళు ఉన్నఫళంగా అతన్ని ఘనంగా సత్కరించుకోవాలనే కఠోర నిర్ణయానికి వచ్చేశారు.
 

                                                                          ***

ఆ రోజే 'అగ్గి రాముడు' అలియాస్‌ త్రేతాగ్నికి ఘనంగా సన్మానం జరిగేరోజు!
ఆ అపార్మెంట్‌ సెల్లార్లో వినాయకుణ్ణి ప్రతిష్టించిన మండపం పక్కనే చిన్న వేదికలాంటిది అందంగా అలకరించారు. ఆ రోజు సాంస్క ృతిక కార్యక్రమాల్లో భాగంగా కమిటీ నిర్వాహకులు అగ్గిరాముడి సన్మాన ఏర్పాట్లు చూసుకుంటున్నారు హడావిడిగా.
అప్పుడే అగ్గిరాముడు అందరికీ చేతులూపుతూ ఎంట్రీ ఇచ్చాడు. తన మహోత్కష్టమైన మేధావితనం ఉట్టిపడేలా.. హుందాగా, మహాగంభీరంగా వివిఐపిలా అక్కడకు విచ్చేశాడు. ఉత్సవ నిర్వాహకులు మొహాల్లో చిచ్చుబుడ్డీలు వెలిగించుకుని అతన్ని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.
అగ్గిరాముడు చిరునవ్వుతో అప్పటికే వేసి వున్న నాలుగు కుర్చీల్లోని ఓ కుర్చీలో ఆసీనుడయ్యాడు. తర్వాత మరో ముగ్గురు పెద్దలను ఆ కుర్చీల్లోకి ఆహ్వానించారు.
ముందుగా ఆ అపార్ట్మెంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పాపారావు మైకును చేతిలోకి తీసుకుని, 'అందరికీ నమస్కారం! మన అగ్గిరాముడు గురించి నేను మీకేమీ చెప్పనక్కరర్లేదు. మన త్రేతాగ్నిగారి సాహిత్యం గురించి చెప్పాలంటే నాకు మాటలు రావటంలేదు. అతని అమరమైన సాహిత్యాన్ని చదివినా, విన్నా మరే ఇతర సాహిత్యం జోలికి పోవాలనిపించదు. అదే అతని గొప్పతనం. వాటితోనే మనల్ని కట్టేసి, కొట్టి పడేస్తారు. అదే.. తన మైకంలో పడేస్తారు!
అలాగే మన అగ్గిరాముడుని ఈరోజూ ఇలా సత్కరించుకోవడం మనందరమూ ఏ జన్మలోనే చేసుకున్న మహాపాపం.. సారీ, పుణ్యం!
మన అగ్గిరాముడు సిట్యూవేషన్‌ డిమాండ్‌ చేయకుండానే కామెడీ చేయడంలో సిద్ధహస్తులు. అతని కవితగానీ, కథగానీ ఏదైనా తీసుకోండి. నేను ఉదయం లేచిన వెంటనే అతని రచనని అలా చూస్తాను. అంతే నా కడుపంతా కదిలిపోతోంది. నా కాలకృత్యాలు అలా జరిగిపోతాయి.
కదిలించేవాడే కవి అనే నానుడికి సార్ధక నామధేయుడు. అందుకే మన మన అగ్గిరాముడుకి 'అగ్గి నిప్పు' పురస్కారాన్ని అందజేస్తున్నాం' అంటూ స్వగర్వంగా తన ప్రసంగాన్ని ముగించాడు.
చప్పట్లతో ఆ ప్రదేశమంతా మార్మోగిపోయింది. ఆ తర్వాత ఇంకో పెద్దమనిషి మైకుని తన చేతిల్లోకి లాక్కుని, తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టాడు. 'మన త్రేతాగ్ని మహాగ్ని. ఇతన్ని అర్థంచేసుకునే విజ్ఞత, విజ్ఞానం మనబోటివారికి చాలవు. ఎవరైనా ఇతని సాహిత్యాన్ని చదివితే కచ్చితంగా పిచ్చెక్కిపోతారు. అదే పిచ్చిపిచ్చిగా అతని పిచ్చిలో పడిపోతారు.
అంతేకాదు ఇతని రచనలు చదివినవారికి నవరంధ్రాల్లో సీసం పోసినంత సమ్మగా ఉంటుంది. దిక్కుమాలిపోయిన సాహిత్యానికి దిక్కులను పరిచయంచేసిన దిక్సూచి. అంతటి అరివీర భయంకరుడు. గుండెల్లో గునపాలు దించగల గండరగండడు!!
ఇలాంటి మహానుభావుడ్నిలా గౌరవించుకోవడం మనందరం చేసుకున్నటువంటి.. అది ఏంటన్నది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను..' అంటూ తన ప్రసంగాన్నీ ముగించాడు తన్నుకోస్తోన్న కన్నీటిని తుడుసుకుంటూ.
తరువాత మూడో పెద్దాయన తనవంతుగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. 'మన అగ్గిరాముడు గురించి చెప్పడానికి మనమెవరం?! అంతా ఆయనే చెప్పుకుంటాడు. అయినా చెప్తాను. మన జీవితంలో వచ్చే ప్రతిరోజుకూ ఏదొక ప్రత్యేక దినమంటూ ఉంటుంది. ఆ దినాల్ని మన అగ్గిరాముడు రోజూ కవితాగానంతో మనకు గుర్తు చేస్తూంటాడు.
మన పండగలను ఆయన జరుపుకుంటాడు. అయన కవిత్వానికి ఎంతటి పవరుందో.. మచ్చుకి మొన్న మా రెండేళ్ల మనవడు ఏడుస్తుంటే, అయన స్వయంగా రాసి పాడినటువంటి ఓ గేయాన్ని వినిపించాను.
అంతే-చప్పున ఏడుపు ఆపేసాడు. అదీ మన త్రేతాగ్నిగారి విద్వత్‌! తన విద్వత్తుతో విద్యుత్‌కే షాక్‌ కొట్టించగల ఘనాపాటి. అంతటి ఉద్ధండ పండితుడుకి ఈ చిన్ని 'నివాళి'! కాదుకాదు 'నీరాజనం'!!' అంటూ మూడో వక్త ముగించగానే యథాలాపంగా చప్పట్లతో ఆ సెల్లారంతా ప్రతిధ్వనించింది.
అనంతరం అగ్గిరాముడు అలియాస్‌ త్రేతాగ్నికి ఓ పెద్ద గజమాల వేసి బరువుగా సన్మానించుకున్నారు. ఆ బరువైన సత్కారం వెనుక ఏ గుదిబండలు, గుండెమంటలు దాగున్నాయో తెలియని అగ్గిరాముడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
కమిటీ నిర్వాహకుడు మాట్లాడుతూ 'రక్తంపీల్చే దోమలు తమ కృతజ్ఞతగా ఏ మలేరియానో, టైఫాయిడునో, కనీసం ఏ డెంగ్యూనో బహుమతిగా ఇచ్చిపోయినట్టుగా, మన అగ్గిరాముడు తన అపరిణత నిండిన అపరిమితమైన తన ఆలోచనల్ని తన రచనల ద్వారా విశృంఖలంగా వితరణ కావిస్తున్నారు.
అయన కవి, రచయిత, గాయకుడు కాబట్టి ఒక్కొక్కదానికి ఒక్కో పదవి. ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ట్రెజరర్‌.. మూడు పదవులు ఒకేసారి ఆయనకు కట్టబెడుతున్నాం. ఏ అపార్ట్మెంట్‌ చరిత్రలో ఏ వ్యక్తిని మూడు పదవులు చేపట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. మనందరికోసం ఇన్ని బరువుబాధ్యతలను మోయబోతున్న అగ్గిరాముడుగారికి కడుపారా నా అభినందనలు తెలియజేస్తున్నాను' అంటూ ఆయనా ముగించాడు.
చివరిగా మన అగ్గిరాముడుని తుదిపలుకులు మాట్లాడమన్నారు. అగ్గిరాముడు మైకుని చేతిలోకి తీసుకుని, 'కవిగా, రచయితగా, గాయకుడిగా నా బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో మీ అందరినీ అలరించిన నన్ను అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక చేయడం మహదానందంగా భావిస్తున్నాను. ఈ మూడు పదవులను దిగ్విజయంగా నిర్వర్తించి, నా సత్తా ఏంటో చూపిస్తాను. ఈ త్రేతాగ్ని అంటేనే చరిత్ర..' ఆవేశంగా అంటోన్న అతని మాటలకు ప్రెసిడెంట్‌ పాపారావు అడ్డుపడుతూ 'ముచ్చటగా మూడేళ్లకు తగ్గకుండా..' అంటూ టైమ్‌ పీరియడ్‌ చెప్పాడు.
పాపారావు మాటలకు, అగ్గిరాముడు మరింతగా చెలరేగిపోతూ 'మూడేళ్లు కాదు, అరేళ్లయినా ఈ మూడు పదవీ బాధ్యతలను నా మునివేళ్ళ మీద నడిపిస్తాను. ఇదే భీష్మ ప్రతిజ్ఞ..!!!' ఆయాసంగా ఊగిపోతూ గట్టిగా మాటిచ్చాడు.
 

                                                                                 ***

ఆరోజు నుంచే మన అగ్గిరాముడు జీవితానికి క్రికెట్‌ మ్యాచ్‌ మొదలైంది. ఏకకాలంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, ఎంపైరింగ్‌లు .. చేయలేక, చేతులు ఎత్తెయ్యలేక చచ్చినట్టు అన్ని బాధ్యతలనూ నిర్విరామంగా చేయలేక చేస్తూ, ఛస్తున్నాడు.
లిఫ్ట్‌ పనిచేయట్లేదని కొంతమంది, చెత్త తీసుకెళ్లడంలేదని ఇంకొంతమంది, మెట్లు పరిశుభ్రంగా లేవంటూ, తప్పుడు పార్కింగులు చేసేస్తున్నారంటూ, టెర్రాసు మీద తమ బట్టలనీ ఆరబెట్టుకోనీయట్లేదని, ఎవరెవరో వచ్చి తమ తలుపులు తడుతున్నారంటూ రకరకాల సవాలక్ష సమస్యలతో అగ్గిరాముడు ముందు ఊపిరి సలపకుండా ఏకరువు పెట్టుకుంటుంటున్నారు.
ఒక సమస్య పరిష్కరిస్తే పది సమస్యలు వచ్చి పడుతున్నాయి. రోజురోజుకి కుప్పలా పేరుకుపోతున్న సమస్యల వలయంలోపడి కొట్టుమిట్టాడుతూ అగ్గిరాముడు తన సాహిత్యాన్ని కాస్త అటకెక్కించేశాడు.
అప్పటివరకూ అగ్గిరాముడి బీభత్సమైన సాహిత్యంతో హడలిపోయి, బెంబేలెత్తిపోయిన పత్రికా సంపాదకులూ, వాట్సాప్‌ గ్రూపుల సభ్యులూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న తమ ప్రాణాలకు ఒక్కసారిగా అంతులేని ఉపశమనం చేకూరినట్టుగా జవసత్వాలు కూడగట్టుకుని సాంత్వన చెందుతున్నారు.
మన అగ్గిరాముడి బాధితులందరూ ఆ వినాయకచవితి తర్వాత 'పండుగకూ ముందు రోజులు - పండుగ రోజు నుండి వచ్చిన రోజులు..' అని రెండు విభాగాలుగా విభజించుకున్నారు.
మొదటి విభాగాన్ని చీకటియుగంగానూ, రెండో విభాగాన్ని తమ జీవితాలకు సాంత్వన దొరికిన స్వర్ణయుగంగా భావించారు. అందరూ ప్రతిరోజూ పండగ చేసుకుంటున్నారు. వచ్చే దీపావళి పండుగను నరకం నుంచి సంపూర్తిగా బైటపడ్డట్టుగా మరింత ధైర్యంగా అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకున్నారు.
అగ్గిరాముడి సాహితీ ప్రపంచం సంపూర్ణంగా చల్లబడిపోయింది. రోజులు అతని కాలాన్ని మింగేస్తున్నాయి. అతని కాళ్ళూ, చేతులు పూర్తిగా తేలేసేశాడు. అన్నిపనులూ దగ్గరుండి చూసుకోవడంతో పాటూ ఆ లెక్కలు రాసుకోవడం, రావాల్సిన మెయింటినెన్స్‌ ఛార్జీలు వసూలు చేసుకోవడంతోనే అతని జీవితం గడిచిపోతుంది.
ఆ అపార్ట్‌మెంట్‌ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ అగ్గిరాముడికి ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. అక్కడి అంతంలేని వ్యాపకాలు అతన్ని ఊపిరి సలపకుండా మింగేస్తున్నాయి.
 

                                                                          ***

అగ్గిరాముడుకి తెలియని అసలు సంగతేమిటంటే-
వినాయకచవితి ఉత్సవాలకు ఓ వారంరోజులకు ముందు జరిగిన కుట్రకోణంలోకి ఓసారి అలా తొంగిచూస్తే..
ఆ అపార్ట్మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీవాళ్ళూ, అతని కవితలతోనూ, కథలతోనూ విసిగి వేసారిపోయిన మరికొంతమంది బాధితులూ అక్కడ సమావేశమయ్యారు. అగ్గిరాముడు అక్షరాలను ఆయుధాలుగా మలిచి, తమకున్న ఆ కాస్త గుజ్జునూ, అస్తిత్వాన్ని ధ్వంసంచేస్తోన్న అరాచకమైన దాడిని ఎదుర్కొనేందుకూ అందరూ కలిసి పగడ్బందీగా తృతీయవర్ష ప్రణాళికను రచించారు.
అందులో భాగంగానే అగ్గిరాముడుకి ఆ సన్మానా పురస్కారాలూ, మూడేళ్లపాటూ ఆ అపార్ట్మెంట్‌ నిర్వహణా బాధ్యతలు!
 

                                                                             ***

రెండేళ్లు ప్రశాంతగా గడిసిపోయాయి అందరికీ!
ఒక్క అగ్గిరాముడుకి తప్ప!!
ఆగిపోయిన ఆ అపార్ట్మెంట్‌ లిఫ్ట్‌ను బాగుచేయిస్తోన్న అగ్గిరాముడి మొబైల్‌ ఫోన్‌ రింగయింది. పనిలో నిమగమైన అతను కాస్త అసహనంగా కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. అట్నుంచి 'అయ్యా, మీరు అగ్గిరాముడేనా?! ఎక్కడా కన్పించడం లేదు! కథలూ, కవితలూ రాస్తున్నారా?!' అంటూ ఆవతలి వ్యక్తి అడిగాడు ఆసక్తిగా.
'వీడియో కాల్‌ చేయకుండా వాయిస్‌ కాల్‌ చేసి కనిపించలేదంటే నేనెలా కనిపిస్తానండి..?! కథలూ, కవితలూ అంటున్నారు వాటితో నాకేంటి సంబంధం?? ఆ రాతలేవో రాసుకునేవారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతారేమి?! నాకు పరిచయంలేని విషయాలు గురించి నాకెందుకు చెపుతున్నారు??! అసలే నేనిక్కడ పరిష్కరించాల్సిన సవాలక్ష పనులతో సతమతమైపోతుంటే మధ్యలో మీ గొడవేంటి..?!' అంటూ అతనిపై చిరాకుతో రుసరుసలాడుతూ ఫోన్‌ కట్‌ చేసి, తన పనిలో మునిగిపోయాడు, మన అగ్గిరాముడు!?

శ్రీనివాసరావు తిరుక్కోవుళ్లూరు
99128 48738