Nov 19,2023 11:37

ఈ కాలం అమ్మాయిలు అన్నింటా అభివృద్ధి చెందుతున్నారు.. ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఒంటరిగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించి, ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. ఆ సందర్భంలో తాము పడ్డ లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు చెబుతుంటే... 'ఈ స్థాయి వారికే వేధింపులు తప్పలేదు.. ఇక మనమెంతా? ' అని సామాన్య స్త్రీలు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎంతటి వారికైనా పురుషుల నుంచి వేధింపులు, హింస ఎదుర్కొనకుండా ఎదగలేరని అందరిలోనూ పాతుకుపోయిన అభిప్రాయం. అందుకు నిదర్శనం ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే. 'పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు సమాజాన్ని పీడిస్తూ, లోతుగా పాతుకుపోయిన సమస్య. మనదేశంలో ఇది త్రీవ ఆందోళన కలిగించే అంశం' అని చెప్పింది. మహిళల పట్ల సమాజంలో వేళ్లూనుకుపోయిన కొన్ని అభిప్రాయాలు, వివక్ష వల్ల ఇళ్లల్లో, పని ప్రదేశాల్లో రకరకాలుగా హింసకు గురవుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితి నవంబరు 25న 'అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం'గా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...

            ప్రపంచవ్యాప్తంగా స్త్రీల దుస్థితి గురించి అవగాహన కల్పించడానికి, మహిళలపై హింసకు కారణమైన సమస్యలను తెరపైకి తీసుకువచ్చి, వాటిని అంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ఈ దినోత్సవం జరుపుకుంటున్నాయి. మహిళలపై హింసను ప్రేరేపించే ఆధిపత్య భావజాలానికి అడ్డుకట్ట వేసి, దాన్ని సమూలంగా అంతం చేయాలని ప్రతిజ్ఞ పూనాయి. కానీ ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళలు రకరకాలుగా వేధింపులకు లోనవుతున్నారు.
           ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ఆంక్షల మధ్య పెంచుతారు తల్లిదండ్రులు. బాల్యం నుంచి ఆడపిల్లల ఆలోచనలకు, నిర్ణయాలకు తాళం వేస్తూ, 'ఆడపిల్లవి...ఆడపిల్ల్లవి..' అంటూ జాగ్రత్తలు చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల వల్ల స్కూలుకు పంపిస్తే ఏం జరుగుతుందోనన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఇంటికి వచ్చే వరకూ తల్లి మనసు తల్లడిల్లుతూనే ఉంటుంది. 'బాలికలపై అత్యాచారాలు- అమ్మాయిలపై కత్తితో దాడి'
          వంటి ఘటనలు విన్నా, చదివినా ఒళ్ల్లంతా గగుర్పాటుకు లోనవుతుంది. 'ఏం చేస్తే.. ఈ ఘాతుకాలు ఆగుతాయి' అన్న ఆలోచన రాకమానదు. పాలకులు తమ పదవిపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లలకు రక్షణ కల్పించడం లేదు.
          ఇంటి ఆర్థిక పరిస్థితులు, పేదరికం వల్ల అమ్మాయిల చదువు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోతుంది. అబ్బాయి ఉన్న ఇంట్లో, అమ్మాయిని బడి మాన్పిస్తున్నారు. కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లో బాల్య వివాహాలు అధికంగా జరిగాయని ఓ సర్వే వెల్లడించింది. దీన్నిబట్టే అర్థమవుతుంది అమ్మాయిల చదువుకు కుటుంబం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. ఆడపిల్లకి చదువు మానసిక స్థైర్యాన్ని, సామాజిక అభివృద్ధిని ఇస్తుంది. తన కాళ్లపై తాను నిలబడేలా చేస్తుంది. అందుకే ఆడపిల్లలను చదువు విషయంలో ప్రోత్సహించాలి. మొదట తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి. ఇంట్లో పని ఆడపిల్లలకు మాత్రమే చెప్పడం కాదు. అబ్బాయిల చేత కూడా చేయించాలి. వంట, ఇంటి పనులు సమానంగా నేర్పించాలి. అప్పుడే భవిష్యత్తు తరాల్లో మార్పు వస్తుంది. అంతేకాదు.. ఆడపిల్ల పట్ల ఎలా నడచుకోవాలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సందర్భానుసారంగా తరచూ చెబుతుండాలి.

sneha


                                                                       గుర్తింపు ఏదీ ?

ఉదయం లేచిన దగ్గర నుంచి వంట చేయడం, పిల్లలకు క్యారేజీలు కట్టడం, భర్తను ఉద్యోగానికి పంపించడం, అంట్లు తోమడం, బట్టలు ఉతికి, ఇల్లు చక్కదిద్దడం చేస్తారు మహిళలు. కానీ వారి పనికి గుర్తింపు లేకపోవడం ఆశ్చర్యం. అసలు అది పనిగానే చూడరు కొంతమంది పెద్ద మనుషులు. 'ఇంట్లోనే కదా ఉంది. ఈ మాత్రం పని కూడా చేయలేవా?', 'నలుగురికి వంట చేయడం కూడా ఓ పనేనా?', 'బయట చూడు చాలా మంది ఆడవాళ్లు ఇంట్లో పనిచేసి, ఉద్యోగాలు చేస్తున్నారు', అని సూటిపోటి మాటలతో ఆమెను మానసికంగా వేధిస్తున్నారు.
            అసలు కొంతమంది మహిళలకు తాము హింసకు గురవుతున్నామని కూడా తెలియకపోవడం ఆందోళకరమైన అంశం. భర్త అంటే భార్యను తిట్టడం, తాగి కొట్టడం అనేది చాలా మామూలు విషయంగా చూస్తున్నారు. ఇటువంటి మహిళల సమస్యలు సమాజాభ్యున్నతికి ఆటంకం.
 

                                                                                ఓ వస్తువుగా ...

పెళ్లి అయిన అమ్మాయిలకు అత్తింటివారి వరకట్న వేధింపులు, భర్త ఒత్తిళ్లు సర్వసాధారణమైంది. ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తి, భార్యను తాకట్టు పెట్టి మరీ జూదం ఆడాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ఆమెను రక్షించాడు. ఇంటికి తీసుకురాగా, ఆమె తనకు వద్దని బయటకు గెంటేశాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా భర్త నడుచుకోవడం, ప్రవర్తించడం నేరం.
          కాలనుగుణంగా ఆమెను ఓ వస్తువుగా, పనిమనిషిగా, ఇంటిపనికి పరిమితి చేయాలన్న ఆలోచనాధోరణి నుంచి సమాజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఉద్యోగం చేసేందుకు అంగీకరిస్తుంది. ఈ క్రమంలో నెలకు కుటుంబం కోసం డబ్బు సంపాదించే ఉత్పత్తి యంత్రంగానూ చూస్తున్నారు. పెళ్లి అయిన ఏడాదిలోపు పిల్లలు పుట్టకపోతే ఆమె పట్ల జరిగే మాటలదాడి అంతా ఇంతా కాదు. మనుషులమన్న జ్ఞానం లేకుండా హింసించడం ఎక్కువయ్యింది. పిల్లల పుట్టకపోతే కేవలం ఆడవాళ్లదే తప్పు అన్న భావన నుంచి మొదట బయటకు రావాలి. అప్పుడే సమస్య ఎక్కడ ఉందో అర్థమవుతుంది. ఇలా కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు ఉద్యమించాయి. ఫలితంగా 2005లో 'గృహ హింస నిరోధక చట్టం' వచ్చింది. నేరం చేసిన వాళ్ళను దండించడమే కాకుండా, బాధితులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం పనిచేస్తుంది. తన కుటుంబంలోని వారు ఎవరైనా సరే శిక్షార్హులే. వారు జరిపే ఎటువంటి హింస నుంచైనా ఆమెకు రక్షణ కల్పించేందుకే ఈ చట్టం ఉంది. కానీ చాలామంది ఆడవాళ్లు ఇంటి సమస్యను బయట పెట్టకుండా భరిస్తూనే ఉన్నారు.
 

                                                                           పిల్లలకు సందేశం

ఇన్నేళ్లలో మహిళలు కాలానుగుణంగా వస్తున్న మార్పులను దగ్గర నుంచి గమనిస్తున్నారు. దేన్ని వద్దని వారించాలో చెప్పే సత్తా, తెగువ ఇప్పటి యువతకు ఉంది. తమ జీవితాలను ఎలా మలుచుకోవాలో స్పష్టత వచ్చింది. కానీ చాలామంది ఇళ్లల్లో మహిళలను అగౌరవంగా మాట్లాడ్డం, విమర్శించడం అనేది నిత్యకృత్యం. అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లల మనసుల్లోనూ అవే అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ దిశగానే వారి ఆలోచనలూ ఉంటాయి. వారూ అదేవిధంగా మహిళలను సంబోధిస్తుంటారు. అలా పురుషాధిక్య భావజాలం తరతరాలకు పాకుతూ వస్తుంది. ఈ తీరు మారాలి. 'ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని కాకుండా.. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే' అని తల్లిదండ్రులే పిల్లలకు నేర్పాలి.. ఆ విధంగానే వారూ ఆచరించాలి.
 

                                                                        పని ప్రదేశాల్లోనూ...

ఇప్పటి మహిళలు ఉద్యోగం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో పని ప్రదేశాల్లో వివక్ష, వేధింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పురుషుల కన్నా తక్కువ వేతనం ఇచ్చే ప్రయివేటు కంపెనీలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల నెపంతో లైంగిక వేధింపులకు గురిచేయడం, మాటలతో హింసించడం జరుగుతోంది. 2013లో 'పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం' వచ్చింది. ఈ చట్టం లైంగిక వేధింపుకు గురైన ప్రతి మహిళకూ వర్తిస్తుంది. అయితే, ఆ మహిళ ఎక్కడైతే వేధించబడిందో అక్కడ ఉద్యోగి అయ్యి ఉండనక్కరలేదు. ఆ పని ప్రాంతం ఏదైనా ప్రభుత్వ లేక ప్రైవేట్‌ ఆఫీసు కావొచ్చు. చట్టం వర్తిస్తుంది.

మహిళలకు ఆలోచనాశక్తి ఉంది. వారిని ప్రోత్సహిస్తే సమాజాభివృద్ధికి తోడ్పడినట్లే. అందుకే వారిపై జరుగుతున్న హింసను అంతం చేయాలి. స్త్రీ అంటే చులకన భావనను తొలగించాలి. ఆమెకూ మనసుంది. తమలానే మనిషి అనే సమభావం రావాలి. ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు సమాజం ప్రశ్నించాలి. బాలికలపైనా, స్త్రీలపైనా జరిగే హింసకు వ్యతిరేకంగా నినదిద్దాం.

                                                                    ఈ పదాలు మాత్రమే వాడాలి

పురుషులే అధికులు, మహిళలు అల్పులనే సాధారణీకరణ భావజాలం నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా బయటపడాల్సిన అవసరాన్ని చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ధర్మాసనం నిర్దేశించింది. మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను ఆయన తొలగిస్తూ.. ఆ స్థానంలో కొన్ని పదాలను మాత్రమే వాడాలని స్పష్టం చేస్తూ హ్యాండ్‌ బుక్‌ విడుదల చేశారు. అవి..
'వేశ్య, వ్యభిచారిణి, ప్రాస్టిట్యూట్‌, వోర్‌, హుకర్‌' వంటి పదాలను నిషేధించింది. దానికి బదులుగా 'సెక్స్‌ వర్కర్‌' అనే పదాన్ని సూచించింది.
ఉంపుడుగత్తె, కీప్‌, కాంక్యుబైన్‌ అనడానికి బదులుగా మహిళ (ఉమన్‌ విత్‌ సెక్సువల్‌ రిలేషన్స్‌ అవుట్‌సైడ్‌ ఆఫ్‌ మ్యారేజి) గా పేర్కొనాలి.
ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు బాస్టర్డ్‌ అని కాకుండా అవివాహ దంపతుల సంతానం (నాన్‌ మారిటల్‌ చైల్డ్‌)
హౌస్‌ వైఫ్‌ పదం స్థానంలో హోమ్‌ మేకర్‌ అనాలి.
మిస్ట్రెస్‌ పదం స్థానంలో ఉమన్‌ అని సంబోధించాలి.
కెరీర్‌ ఉమన్‌ను.. ఉమన్‌ (మహిళ) అని పిలిస్తే సరిపోతుంది.
ఈవ్‌టీజింగ్‌ని ఇకపై స్ట్రీట్‌ సెక్సువల్‌ హెరాస్మెంట్‌గా పేర్కొనాలి.
భారతీయ / విదేశీ మహిళ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళ అని అంటే సరిపోతుంది.
అన్‌వెడ్‌ మదర్‌ (అవివాహ తల్లి) స్థానంలో మదర్‌ (అమ్మ) అనాలి.
స్పిన్‌స్టర్‌ (కన్య) అని పేర్కొనడం కన్నా అవివాహిత మహిళ (అన్‌ మ్యారీడ్‌ ఉమన్‌) అనడం సముచితం. ఇలా పలు పదాలకు ప్రత్యామ్నాయాలను సుప్రీం కోర్టు విడుదల చేసిన హ్యాండ్‌ బుక్‌లో వివరించింది. ఇకపై న్యాయస్థానాల్లో వాదనలు, విచారణలు, తీర్పుల సందర్భంగా ఈ పదాలనే వినియోగించాల్సి ఉంటుంది.

పద్మావతి
9490099006