Oct 30,2023 13:09

న్యూఢిల్లీ :  ఐరాస జనరల్‌ అసెంబ్లీ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.   ప్రపంచంలో హింసకు స్థానం లేదని  కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ  జాతీయ మీడియాతో పేర్కొన్నారు. హమాస్‌ దాడులను   తమ పార్టీ  ఖండిస్తున్నట్లు మరుసటి రోజే ప్రకటన విడుదల చేశామని  అన్నారు. హమాస్‌ దాడులకు  ప్రతిగా విషాదం చోటుచేసుకుందని,  ఇజ్రాయిల్‌ గాజాపై చేపడుతున్న ప్రతీకార దాడుల్లో  మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు.  పాలస్తీనా రాష్ట్ర సార్వభౌమ, స్వతంత్ర, భద్రత కోసం ఇజ్రాయిల్‌తో శాంతి చర్చలు జరపాలని తమ పార్టీ దీర్ఘకాలంగా కోరుకుంటోందని అన్నారు. ఇజ్రాయిల్‌ జరుపుతున్న అమానవీయ దాడులను మనమందరం సమిష్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చేందుకు, మనమందరం సమిష్టిగా మేల్కనేందుకు ఇంకా ఎంతమంది ప్రాణాలు బలికావాలని ప్రశ్నించారు. ఇటీవల గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండను ఆపాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ హమాస్‌ మధ్య తక్షణ, స్థిరమైన  సంధి, శతృత్వ విరమణకు పిలుపునిచ్చేలా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరు కావడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.