Nov 20,2023 07:56

వాషింగ్టన్‌ :  ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధం తర్వాత వెస్ట్‌బ్యాంక్‌, గాజాను అంతిమంగా  పాలస్తీనా అథారిటీ పరిపాలించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ శనివారం వ్యాఖ్యానించారు.  యుద్ధం అనంతరం గాజా విషయంలో అమెరికా అభిప్రాయాన్ని బైడెన్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌లోని ఓ ఆర్టికల్‌లో వెల్లడించారు.

''మేము శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం. గాజా మరియు వెస్ట్‌బ్యాంక్‌లు పాలస్తీనా పాలన కిందకు రావాలి. పాలస్తీనా అథారిటీని బలోపేతం చేయాలి. మనమందరం అంతిమంగా రెండు దేశాల పరిష్కారం కోసం కృషి చేయాలి '' అని వాషింగ్టన్‌ పోస్ట్‌లో బైడెన్‌ తెలిపారు. '' గాజా నుంచి పాలస్తీనా వాసులను బలవంతంగా తరలించకూడదు.  ఆ ప్రాంతాన్ని తిరిగి  ఆక్రమించకూడదు. ముట్టడి లేదా దిగ్బంధం చేయకూడదు. పాలస్తీనా భూభాగ విస్తీర్ణాన్ని తగ్గించకూడదు.'' అని పేర్కొన్నారు.

వెస్ట్‌బ్యాంక్‌లో పౌరులపై దాడులు చేసే ఉగ్రవాదులకు వీసా నిషేధాలను జారీ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్‌ పేర్కొన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులను ఆపాలని, హింసకు పాల్పడే వారు జవాబుదారీగా ఉండాలని ఇజ్రాయిల్‌ నేతలతో తాను స్పష్టం చేశానని అన్నారు.  గాజా ప్రాంతం మొత్తానికి సైనిక రక్షణ బాధ్యతలను తాము చూస్తామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.