ఎండాకాలంలో వేడివల్ల చాలామందిలో మైకం,వాంతులు, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాల వేడి ఎక్కువగా శరీరం, తలపై పడి తీవ్ర ప్రభావం చూపుతాయి. దాంతో నాడీ వ్యవస్థ నెమ్మది అవుతుంది. దాంతో అలసిపోయి కిందపడిపోవడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయి. వడదెబ్బ తగలినప్పుడే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే మొదట్లోనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. పూర్తిగా నీరసించి కదలలేని స్థితికి చేరుకోకముందే జాగ్రత్తలు పాటించాలి.
- గాలిలో తేమ తగ్గి వేడి పెరిగినప్పుడు ఆ గాలి పీల్చి, వదిలినప్పుడు శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. మెదడుకు సరైన రక్త ప్రసరణ జరగదు. దాంతో చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. తలనొప్పిగా ఉంటుంది.
- ఆ సమయంలో తినే ఆహారం చాలా ముఖ్యం. ఆయిల్ ఉన్న, కల్తీ ఆహారం తీసుకున్నా జీర్ణం అవ్వదు. వాంతులు అవుతాయి. వికారంగా అనిపిస్తూ ఉంటుంది. త్వరగా నీరసం అయిపోతూ ఉంటారు. అప్పుడు ఎండ, వేడిగాలి తగలని గదిలో పడుకోవాలి. తలపై ఐస్‌ప్యాక్ పెట్టుకోవాలి. లేదా మెత్తటి గుడ్డను తడిపి తలపై వేసుకోవాలి. శరీరం తేమగా ఉండేట్లు తుడుస్తూ ఉండాలి.
- తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా తలకు టోపీ, కాళ్లకు బూట్లు, శరీరం కనిపించకుండా నూలు దుస్తులు వేసుకోవాలి. గొడుకు వేసుకోని వెళ్లాలి.
- మజ్జిగ అన్నమే తినాలి. కొద్ది కొద్దిగా రెండు, మూడు సార్లు తీసుకోవాలి. కుండలో నీళ్లు మాత్రమే తాగాలి. కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగాలి. ద్రవపదార్థాలు మాత్రమే తాగాలి. ఇలా రెండు రోజులైనా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.










