Nov 19,2023 06:52

'కుల, మతాల పట్టింపులేదు.. దేశవిదేశాలతో పనిలేదు.. అన్యాయం, అక్రమం, దారుణాలు ఎక్కడ జరిగినా స్పందిస్తాం.. సంఘీభావం తెలుపుతాం' అంటూ చిన్నారులు వేసిన చిత్రపటాలివి. పిల్లలపై యుద్ధం ఎంతటి తీవ్ర పరిణామాలను తెస్తుందో వివరించిన వాళ్ల చిట్టి చేతులతో సృష్టించిన అద్భుత కళాఖండాలివి. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ తలపెట్టిన యుద్ధంలో తమ ఈడు పిల్లలు అశువులు బాయటం చూసి చలించిపోయిన లేత హృదయాల భగ ముద్రితలివి..

1


స్కూలు బ్యాగు, ఆట వస్తువుల మధ్య రక్తంతో తడిసిన చిన్నారి, ఆ పక్కనే కట్టడాల కింద అశువులు బాసిన బుజ్జాయి చేతిలో పాలసీసా చిత్రంలో 'మేము శాంతిని కోరుకుంటున్నాం' అన్న నినాదంతో గాయాలతో రక్తం కారుతున్న బాలుడు, అతని ఒడిలో ఆటబొమ్మ చిత్రం పిల్లలపై యుద్ధ ప్రభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
'మేము జీవించాలనుకుంటున్నాం' అన్న నినాదం పట్టుకున్న బాలిక చిత్రంలో శాంతి చిహ్నంలా చేతిలో గులాబి పట్టుకున్న గాయపడిన చిన్నారి, ఆ పక్కనే ముఖమంతా రక్తసిక్తమైన బాలుడి చిత్రపటం పిల్లల ఆవేదనను ప్రతిబింబించింది.

8


యుద్ధ భయంతో ఒకపక్క మోయలేని బరువును మోస్తూ, చంకలో ఒక బిడ్డ, చేత్తో మరోబిడ్డను తీసుకుని తరలిపోతున్న ఓ మాతృమూర్తి చిత్రపటం ఎంతోమంది వెతలను కళ్లకు కట్టినట్లు ఉంది.
ఛిద్రమైన కట్టడాల మధ్య బిడ్డను అక్కునచేర్చుకున్న తల్లిని చిత్రించిన చిత్రపటంలో యుద్ధం పిల్లలు, మహిళలపై చూపించే ప్రభావానికి అద్దం పడుతోంది.
అన్ని మతాలూ సమానమనే సందేశం ఇస్తూ శాంతి కపోతంతో ప్రపంచ శాంతిని కోరుకుంటూ వేసిన చిత్రపటం చిన్నారుల ఆకాంక్షను తెలియజేస్తోంది.
యుద్ధభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విచార వదనాలతో కూర్చొన్న కుటుంబాలను చిత్రించిన చిత్రపటాలు యుద్ధ ప్రభావ ప్రాంతవాసుల వెతలను కళ్లకు కడుతోంది.

3


ఒకపక్క ఆటబొమ్మలతో ఆడుకుంటూ, మ్యాజిక్‌ షోలతో సరదాగా గడుపుతున్న చిన్నారులు, మరోపక్క, యుద్ధంలో అమ్మానాన్నను కోల్పోయి, తుపాకులు, ఫిరంగుల మధ్య గాయాలతో చెట్టుకింద కూర్చొన్న పిల్లాడి బొమ్మలో పిల్లల స్వేచ్ఛ, సంతోషాలను కాలరాస్తున్న యుద్ధాన్ని, ఒకే ఈడు పిల్లల మధ్య యుద్ధం తలపెట్టిన అగాధాన్ని చూపించారు.
మర ఫిరంగులు, మారణాయుధాల మధ్య మరణశయ్యపై పిల్లలు, శిధిలాల కింద చిన్నారులు, ఆహ్లాదకర వాతావరణంలో స్వేచ్ఛగా వివహరిస్తున్న బుజ్జాయిలు.. అందరికీ శాంతి కావాలన్న ఇతివృత్తంతో ప్రశాంతతకు చిహ్నమైన పావురం అక్కున చేర్చుకున్న ప్రపంచాన్ని చిత్రించారు.
యుద్ధ కాంక్షను వీడి ప్రపంచ దేశాలు శాంతిని కోరుకోవాలని సుడిగుండాల మధ్య అన్ని దేశాల జాతీయపటాలను చుట్టుకున్న చేతితో ప్రపంచాన్ని శాంతికి చిహ్నమైన పావురం వైపు చూపించడం పిల్లల సృజనకు, వారి ఆకాంక్షకు అద్దం పడుతోంది.

4


యుద్ధంపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేని వయసులో, యుద్ధ ప్రభావం తమని ఎంతలా వేదనకి గురిచేస్తుందో చెప్పలేని ఈడులో తమ ఆకాంక్షలను, ఆశలను బొమ్మల రూపంలో వ్యక్తం చేసిన ఈ చిన్నారులను అభినందించకుండా ఉండలేం. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి, ఈ బొమ్మల భాషలో పిల్లల అంతరంగాలను వెలికితీయడానికి నడుం బిగించింది 'ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్‌'. విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాల్లో బొమ్మల రూపంలో పిల్లల మనోభావాలను వెలికితీయడంలో ముందుంటోంది. అనేక చోట్ల చిత్రకళాపోటీలు, ప్రదర్శనలతో పిల్లల్లో దాగున్న సృజనను వెలికితీస్తోంది. ప్రారంభించిన అనతికాలంలోనే వేలాది మంది చిన్నారులు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడం మంచి పరిణామం.

4


ఈ ఏడాది నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధం.. పిల్లలపై ప్రభావం అంశాన్ని ఇచ్చింది. 6 నుండి 10వ తరగతి పిల్లలకు ఇచ్చిన ఈ అంశంపై అపూర్వ స్పందన వచ్చింది. ఆన్‌లైన్‌ వేదికగా ప్రకటించిన అతి స్వల్ప కాలంలోనే రాష్ట్ర నలుమూలల నుండి అనేక చిత్రాలు చేరాయి. వాటిలో ఎంపికచేసిన చిత్రాలతో జాషువా సాంస్కృతిక వేదిక భాగస్వామ్యంతో విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో కొద్ది రోజుల కిందట ప్రదర్శన ఏర్పాటు చేశారు. యుద్ధంపై చిన్నారుల విశేష స్పందన చూసిన వీక్షకులకు ఆశ్చర్యంతో మాటలు రాలేదు.
ఏ దేశం వారైనా, ఏ మతం వారైనా, రంగులు వేరైనా, జాతులు భిన్నమైనా, భాషలు ఒకటి కాకపోయినా పిల్లలు శాంతికి చిహ్నాలు. స్వేచ్ఛకు ప్రతిరూపాలు. వారి ఆకాంక్షలను, ఆశలను పెద్దలు గౌరవించాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను యుద్ధం పేరుతో ఊచకోత కోయడం అమానవీయం. ఈ దారుణాన్ని, పిల్లల దీనత్వాన్ని తమ చిత్రాలలో ప్రతిబింబించిన ఈ పిల్లలు, ప్రపంచంలోని కోట్లాది చిన్నారుల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపాలు.

- జ్యోతిర్మయి