Oct 19,2023 06:49

తలకోన అడవిలోకి 'ద్వైతం' అనే కాకి కొత్తగా వచ్చింది. అప్పటికే అక్కడ నివాసం వున్న కాకులు ద్వైతాన్ని పలకరించాలని చూశాయి. కానీ 'ద్వైతం' ఎవరితోనూ మాట్లాడలేదు. కొన్ని కాకులు 'కొత్త కదా' అంటే, మరికొన్ని 'పొగరు' అన్నాయి. అయినా 'ద్వైతం' ఇవేమీ పట్టించుకోకుండా తన పనిలో తాను వుండేది. ఉదయమే ఆహారానికి పోవడం రాత్రికి తిరిగి వచ్చి గూడులో ఒంటరిగా నివాసం వుండడం దాని దినచర్య. మిగిలిన కాకులన్నీ సాయంత్రం అయితే చాలు ఒక చోట చేరి ఆ రోజు చూసిన వింతలు, తిన్న తిండి గురించి మాట్లాడుకుంటూ సందడిగా ఉండేవి. ఈ సమావేశాలకు ఒక్కరోజు కూడా ద్వైతం రాలేదు.
ఒకరోజు ఒక పెద్ద కాకి ద్వైతాన్ని పిలిచి 'నువ్వు అందరితో కలిసి వుండొచ్చుగా... ఇలా ఒంటరిగా ఉండడం దేనికి?'' అంది.
'నాకిలాగే ఇష్టం..' అంది ''ద్వైతం'.
ఇక దానితో మాట్లాడి ప్రయోజనం లేదు అనుకుంటూ ఎగిరి పోయింది పెద్ద కాకి. మిగిలిన కాకులన్నీ ఎక్కడ ఆహారం కనిపించినా అందరినీ పిలిచి, కలిసి తినేవి. ద్వైతం మాత్రం ఎక్కువ ఆహారం వున్నా కూడా మిగతా వాటికి చెప్పేది కాదు. ఒకరోజు చెట్టు కొమ్మ పడి 'ద్వైతం' కాలికి, రెక్కకి దెబ్బ తగిలింది. లేవలేని పరిస్థితి వచ్చింది. అటు వైపుగా పోతున్న పిల్ల కాకి దాన్ని చూసి దగ్గరకు రాకుండా వెళ్ళి పోయింది. మరో కాకి కూడా అలాగే చేసింది.
'నేను ఎప్పుడూ వాళ్ళతో మాట్లాడ లేదు. వాళ్ళు నా దగ్గరకు ఎందుకు వస్తారు' అనుకుంది 'ద్వైతం' మనసులో. కానీ కొద్ది సేపటికే చాలా కాకులు ఎగురుకుంటూ దాని దగ్గరకు వచ్చాయి. 'మనవాళ్ళని తీసుకు రావాలనే మేము నీ దగ్గరకు రాలేదు' అంది పిల్ల కాకి. కాకుల గుంపులో కొంచెం వైద్యం తెలిసిన కాకి ద్వైతానికి చికిత్స చేసి, కాలుకి కట్టుకట్టింది. కాకులన్నీ తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా ద్వైతానికి కన్నీళ్లు కారాయి. 'చూడు ద్వైతం నువ్వు ఇంతలా బాధపడనవసరం లేదు. మన జాతి ఐకమత్యానికి పెట్టింది పేరు. ఎవరికి ఆపద వచ్చినా అందరం కూడి ధైర్యం చెపుతాం. ఒకరికి ఆహారం దొరికినా మిగిలిన వాళ్ళని పిలిచి పంచు కుంటాం. కనుక మనం అంతా ఒకటిగా కలిసి వుండాలి' అంది ఓ ముసలి కాకి. 'నన్ను క్షమించండి ఇకపై అందరితో కలిసి వుంటా' అంది ద్వైతం అందరి వంక చూస్తూ.


- కూచిమంచి నాగేంద్ర, 91821 27880.