రాజు, రమేష్ ప్రాణ స్నేహితులు. స్కూల్లో కూడా బాగా చదువుకుంటారు. అర్థంకాని పాఠాలు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఓ రోజు రమేష్ పాఠశాలకు రాలేదు. అప్పుడు వాళ్ల తరగతి గదికి సోషల్ సార్ వచ్చారు. 'రేపు పరీక్ష ఉంటుంది. అందరూ రాయాలి. రాయకుంటే కఠిన చర్యలు ఉంటాయి' అని చెప్పి వెళ్ళారు.
ఆ రోజు పాఠశాల అయిపోగానే రమేష్ ఇంటికి వెళ్ళాడు రాజు. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్లానని రమేష్ చెప్పాడు. ఆ రోజు క్లాసులో ఏం పాఠాలు జరిగాయని అడిగాడు. 'రేపు సోషల్ పరీక్ష ఉంది. సార్ చెప్పారు. పరీక్ష బాగా రాయకపోతే ఊరుకోనని కచ్చితంగా చెప్పారు. ఈ విషయం చెబుదామనే నేను వచ్చాను. ఇదిగో ఈ పాఠంలోని ప్రశ్నలు బాగా చదువుకో' అని చెప్పేసి రాజు వెళ్లిపోయాడు.
మరుసటి రోజు సోషల్ పరీక్షకు అందరూ హాజరయ్యారు. రమేష్ కూడా పరీక్ష రాశాడు. అది చూసిన సార్ 'రమేష్, ఈ పాఠంలోని ప్రశ్నలే పరీక్షకు ఉంటాయని నీకెలా తెలుసు?' అని అడిగారు. 'రాజు చెప్పాడు సార్.' అన్నాడు రమేష్. 'స్నేహితులు అంటే ఇలా ఉండాలి. ఒక రోజు తరగతికి రాకపోయినా ఆరోజు ఏమి చెప్పారో ఒకరికొకరు తెలుసుకోవాలి. మీరు అందరూ కూడా రాజు, రమేష్‌లా స్నేహంగా ఉండాలి' అన్నారు సోషల్ సార్. 'సరే సార్' అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో. '
- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027