Oct 29,2023 07:28
  • ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల మంది ప్రజలు స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. వీరిలో 6.5 మిలియన్ల మంది చనిపోతున్నారు. 8.5 మిలియన్ల మంది బతికినప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంగ వైకల్యానికి స్ట్రోక్‌ ప్రధాన కారణం. ప్రమాద కారకాలను పరిష్కరించడానికి ప్రజల్లో అవగాహన పెంచగలిగితే స్ట్రోక్‌లలో దరిదాపుగా సగం స్ట్రోక్స్‌ను నివారించవచ్చు. పక్షవాతం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) యొక్క స్వభావం, దాని విస్తృతిని నొక్కి చెప్పడానికి, పరిస్థితి యొక్క నివారణ, చికిత్సపై అవగాహన పెంచాలి. అందుకోసమే అక్టోబర్‌ 29వ తేదీని ప్రపంచ స్ట్రోక్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుఎస్‌ఓ) ఆధ్వర్యంలో 2006 నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా దీనిపై ప్రత్యేక కథనం..

మనదేశంలో లక్ష జనాభాలో 45 మందికి ఈ స్ట్రోక్‌ సంభవిస్తుంది.. ప్రతి నిమిషానికి ముగ్గురు భారతీయులు ఇలాంటి స్ట్రోక్‌తో గురవుతున్నారు. ఈ మేరకు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అధిక రక్తపోటు, సిగరెట్‌, బీడీ, పాన్‌ పరాక్‌ల రూపంలో వాడే పొగాకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడానికి ప్రధాన కారకాలు. ఈ రెండింటిని అదుపు చేయగలిగితే పక్షవాతంతో మరణిస్తున్న ప్రతి 10 మందిలో నలుగురిని రక్షించవచ్చు. స్ట్రోక్‌ మరణాల్లో ఐదవ వంతు మరణాలు ధూమపానంతో ముడిపడి ఉన్నాయి. పొగాకు వాడకాన్ని తగ్గించగలిగితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ద్వారా జరిగే మరణాల్లో సగం జరగకుండా చేయవచ్చు.
బ్రెయిన్‌ స్ట్రోక్‌ సాధారణంగా వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని వృద్ధులకే పరిమితం కాదు. చిన్న వయస్సు వారికి కూడా ఇది సంభవించే అవకాశం ఉంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదకర కారణాలను గుర్తించాలి. అలాగే దాని ప్రాథమిక లక్షణాలను వెంటనే గుర్తించి, ఈ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే వైద్యం చేయగలగాలి. అప్పుడే దీని ప్రమాదాలను నివారించవచ్చు. వ్యాధి తీవ్రతను కూడా బాగా తగ్గించవచ్చు.

  • స్ట్రోక్‌ అంటే ఏమిటి..?

మెదడు రక్తప్రసరణకు అవరోధం కలగడం.. నరాలు చిట్లడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితిని బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటారు. తత్ఫలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్‌ అంతరాయం కలగడం వల్ల ఆ భాగం యొక్క కణాల మరణానికి దారితీస్తుంది. స్ట్రోక్‌ సంభవించినప్పుడు సకాలంలో చికిత్స చేయడం అనేది దీర్ఘకాలిక / శాశ్వత నష్టాన్ని నిరోధించడంలో చాలా కీలకమైనది.
సంకేతాలు..

  • స్ట్రోక్‌ సాధారణంగా అకస్మాత్తుగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా కూడా రావొచ్చు.
  • మత్తుగా ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం.
  • నడవడానికి కష్టంగా ఉండడం.
  • మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, ఎదుటివారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోలేకపోవడం.
  • కళ్ళు సరిగా కనిపించకపోవడం. తల నొప్పిగా ఉండడం.
  • ఒకవైపు ముఖం, కాళ్లు, చేతులు మొద్దుబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారించాలంటే..

  • పక్షవాతాన్ని నివారించాలంటే రక్తపోటును తరచుగా తనిఖీ చేసుకోవాలి.
  • ఉండవలసిన మోతాదు కంటే బి.పి ఎక్కువ ఉంటే గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీయవచ్చు.
  • 18 సంవత్సరములు పైబడిన వారందరూ క్రమం తప్పక బి.పిని తనిఖీ చేసుకోవాలి / చేయించుకోవాలి.
  • 40 సంవత్సరాలు పైబడిన వారందరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా రక్తపోటు తనిఖీ చేయించుకోవాలి.
  • 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు వారు కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారైనా బి.పి.ని తనిఖీ చేయించుకోవాలి.
  • heart-attack-article-causes-precautions-awareness-bp

     

రకాలు..
స్ట్రోక్‌ అనేది ప్రధానంగా ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ (ischemic stroke) హెమరేజిక్‌ స్ట్రోక్‌ (hemorrhagic stroke) అనే రెండు రకాలు. కొన్నిసార్లు మెదడుకు రక్తప్రసరణలో తాత్కాలికంగా అంతరాయం కలగవచ్చు. కొద్దిసేపట్లోనే సరికావచ్చు. ఇలా జరిగినప్పుడు వ్యాధి శాశ్వత లక్షణాలకు దారితీయదు. ఈ పరిస్థితిని తాత్కాలిక ఇస్కీమిక్‌ ఎటాక్‌ (transient ischemic attack(TIA)) అని అంటారు.

  • ఇస్కీమిక్‌ స్ట్రోక్‌

మెదడుకు రక్తాన్ని అందించే ధమనులలో అడ్డంకి కారణంగా సంభవించే స్ట్రోక్‌. ఇది అత్యంత సాధారణమైన రకం. మెదడు రక్తనాళం సన్నబడటం / వాటికి అవరోధం ఏర్పడటం వల్ల వచ్చేది. రక్తనాళాల ద్వారా సరఫరా చేయబడే రక్తం సరిపోయినంత చేరక మెదడులోని కొంతభాగం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనిని ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ అంటారు. రక్తనాళాల్లో కొవ్వు నిక్షేపాలు ఏర్పడటం (అతిరోస్‌ క్లిరోసిస్‌), స్థానికంగా రక్తం గడ్డకట్టడం, రక్తప్రవాహం ద్వారా రక్త గడ్డలు వచ్చి రక్తనాళాలకు అడ్డుపడడం ఇస్కీమిక్‌ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు.

  • ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ చికిత్స..

ఇస్కిమిక్‌ స్ట్రోక్‌, ట్రాన్సియట్‌ ఇస్కిమిక్‌ స్ట్రోక్‌కి వైద్యంలో ప్రధానమైనది టిష్యూ ప్లాస్మినోజెన్‌ ఆక్టివేటర్‌ అనే ఔషధం. ఇది మెదడుకు రక్తప్రసరణకు అడ్డుగా వున్న రక్త గడ్డలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ మందును చేతిలోని రక్తనాళం ద్వారా ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. స్ట్రోక్‌ లక్షణాలు ప్రారంభమైన తరువాత మూడు గంటలలోపు ఈ ఔషధాన్ని ఇవ్వాలి. ఐదు గంటల వరకు కూడా ఈ ఇంజెక్షన్‌ ఇవ్వవచ్చు. అయితే మూడు గంటల లోపు ఇచ్చినంత ఫలితం ఉండదు. ఏమైనా కొంతవరకు ఉపయోగం మాత్రం ఉంటుంది. చికిత్స ఎంత త్వరగా చికిత్స ప్రారంభమైతే ఫలితాలు అంత మెరుగ్గా ఫలితాలు ఉంటాయి. ఈ మందును ఐదు గంటల లోపు తీసుకోలేకపోతే రక్తాన్ని పలుచపరిచే యాస్ప్రిన్‌, క్లొపిడోగ్రిల్‌ మందులను తీసుకోవచ్చు. ఇవి రక్తనాళాల్లో ఏర్పడిన రక్తపు గడ్డ సైజు పెరగకుండా ఉపయోగ పడుతుంది. రక్తం గడ్డకట్టకుండా కూడా ఉపయోగపడుతుంది. రక్తం గడ్డ పెద్దది కాకుండా ఆపడానికీ సహాయపడతాయి.
మెదడులోని రక్తనాళాలలో ఏర్పడిన రక్తపు గడ్డను తొలగించడానికి, రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి అనేక రకాలైన వైద్యాలు అందుబాటులో ఉన్నాయి.
1. థ్రోంబెక్టమీ: రక్తనాళం నుండి రక్తపు గడ్డను తొలగిస్తుంది. తొడలో కాథెటర్‌ అని పిలువబడే పొడవైన, సౌకర్యవంతమైన ట్యూబ్‌ను ఉంచుతారు. దీనిని మెడ లేదా మెదడులోని నిరోధించబడిన ధమనికి థ్రెడ్‌ చేస్తారు.
2. యాంజియో ప్లాస్టి , స్టెంటింగ్‌ విధానాలు: ధమనిలోకి బెలూన్‌ లేదా చిన్న మిస్టివ్‌ను చొప్పిస్తారు. బెలూన్‌ను సున్నితంగా పేల్చడం / మెష్‌ ట్యూబ్‌ని విస్తరించడం వల్ల మెదడుకు రక్తం మరింత సులభంగా ప్రవహించేలా క్లియర్‌ చేస్తాయి.

  • హెమరేజిక్‌ స్ట్రోక్‌ చికిత్స..

హేమరేజిక్‌ స్ట్రోక్‌ అకస్మాత్తుగా సంభవిస్తుంది. చాలా త్వరగా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. వీలైనంత త్వరగా చికిత్స పొందడమే పూర్తిగా కోలుకోవడానికి కీలకమవుతుంది. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో, ఎంత మోతాదులో రక్తస్రావం జరిగిందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

  • స్ట్రోక్‌ వలన ఏర్పడే కాంప్లికేషన్స్‌ ఏమిటి?

మెదడు యొక్క రక్త ప్రవాహం ఎంతకాలం అడ్డగించబడింది.. ఏ భాగం ప్రభావితం చేయబడింది.. అనే అంశాల ఆధారంగా స్ట్రోక్‌ తరువాత ఒక వ్యక్తికి తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలు సంభవించవచ్చు.

ఈ ఆరోగ్యకరమైన మార్పులు చేయడం ఎంతో ముఖ్యం. దీనివల్ల పక్షవాతాన్ని నివారించడమే కాకుండా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు. ఇప్పటికే ఆ జబ్బులు ఉన్నా వాటివల్ల వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యలనూ తగ్గించుకోవచ్చు.

  • ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన హెచ్చరికలు

- మూతి వంకర పోవడం, చేయి బలహీనపడడం, మాట్లాడడం కష్టంగా ఉండడం, వేగంగా పనిచేయలేకపోడం.
- ఫాస్ట్‌ (FAST) అనే మెమోనిక్‌ ను ఉపయోగించి బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలను గుర్తించవచ్చు.
- F (face): మూతి వంకర పోవడం. రోగిని నవ్వమని అడిగితే మూతి అసమానంగా కనిపిస్తుంది.
- A (arm): రెండు చేతులను పైకి ఎత్తమంటే ఒక చేయి బలహీనంగా ఉంటుంది. చేయి పైకి లేపడం కష్టంగా ఉంటుంది.
- S (speech): మాటలు అస్పష్టంగా ఉంటాయి. మాట్లాడడానికి కష్టమనిపిస్తుంది.
-T(time): సమయం చాలా కీలకం. ప్రతి నిమిషం విలువైనదే. సమయాన్ని వృథా చేయకూడదు.వెంటనే వైద్యుని సంప్రదించాలి.

  • హెమరేజిక్‌ స్ట్రోక్‌

రక్తనాళం లోపల లీకేజీ కావడం లేదా చిట్లటం వల్ల ఈ రకమైన స్ట్రోక్‌ ఏర్పడుతుంది.రక్తనాళాలను ప్రభావితం చేసే అనేక పరిస్థితుల ఫలితంగామెదడులో రక్తస్రావం జరగవచ్చు.రక్తస్రావం ఎక్కడ జరిగింది అనే అంశం కారణంగా రెండు రకాలుగా ఉంటుంది.
ఇంట్రాసెరిబ్రల్‌ హెమరేజ్‌-(ICH )మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడం కారణంగా సంభవిస్తుంది.
సబ్‌ అరక్‌ నాయుడ్‌ హేమరేజ్‌ (SAH) మెదడు మరియు మెదడును కప్పి ఉంచే పొరల మధ్యలో రక్తం కారడం సంభవిస్తుంది.

  • తాత్కాలిక ఇస్కీమిక్‌ ఎటాక్‌(TIA)

'కొన్నిసార్లు ఇస్కీమియా తక్కువ మోతాదులో జరుగుతుంది. అప్పుడు మెదడులోని కొంత భాగానికి సరఫరా కొద్దిగా తగ్గుతుంది ఇలాంటి సందర్భాల్లో మెదడుకు తక్కువ స్థాయిలో ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి ఐదు నిమిషాల కంటే మించి ఉండకపోతే పెద్దగా పక్షవాత లక్షణాలు కనిపించవు.శాశ్వత నష్టాన్ని కలిగించే పరిస్థితి ఉండదు..ఈ పరిస్థితిని ట్రాన్సియంట్‌ ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ లేదా మినీ స్ట్రోక్‌ అని అంటారు(TIA) లక్షణాల ఆధారంగా స్ట్రోక్‌ కు మినీ స్ట్రోక్‌ కు మధ్య తేడాను గుర్తించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. కాబట్టి మినీ స్ట్రోక్‌ అని అనిపించినప్పటికీ స్ట్రోక్‌ కు చేయవలసిన పరీక్షలు చేయించుకోవాలి .మెదడులో పాక్షికంగా మూసుకుపోయిన లేదా సంకోచింపబడిన ధమని కారణంగా టి.ఐ.ఎ సంభవించవచ్చు. ఇది తరువాత పూర్తి స్థాయి స్ట్రోక్‌ గా మారే అవకాశం ఉంటుంది.

  • ఏ ఇబ్బందులు ఏర్పడవచ్చు..

>  మాట్లాడటంలో సమస్యలు: స్ట్రోక్‌ వచ్చిన వ్యక్తులు కొన్నిసార్లు ఇక మాట్లాడలేకపోవచ్చు / ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ పరిస్థితిని ''అఫాసియా'' అని అంటారు. కొంతమందిలో మాట ముద్దగా ఉండవచ్చు, ఆ పరిస్థితిని ''డిస్సార్థ్రియా'' అని పిలుస్తారు.
> కండరాల బలహీనత సమస్యలు: స్ట్రోక్‌ వచ్చిన వ్యక్తులకు కొన్నిసార్లు కండరాల బలహీనత / శరీరంలో ఒకవైపు పక్షవాతం వస్తుంది. కండరాల బలహీనత ముఖం, చేయి, కాలుపై ప్రభావం చూపుతుంది. దీనిని ''hemiparesis'' అని అంటారు.
> నడవడంలో ఏర్పడే సమస్యలు: స్ట్రోక్‌ తరువాత, కొంతమంది నడవడం, వస్తువులను పట్టుకోవడం, బ్యాలన్స్‌ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. స్ట్రోక్‌ బలహీనత / స్పర్శను కోల్పోకపోయినా, వారు నియంత్రిత, ప్రణాళికాబద్ధమైన కదలికలను చేయలేకపోవచ్చు. ఈ పరిస్థితిని ''అప్రాక్సియా' (apraxia) అని అంటారు.
> పాక్షికంగా స్పర్శకోల్పోవడం: స్ట్రోక్‌ తరువాత కొంతమంది తమ శరీరం యొక్క ఎడమ లేదా కుడి సగంలో పాక్షికంగా / పూర్తిగా స్పర్శని కోల్పోవచ్చు.
> తినడం / మింగడం కష్టంగా ఉండటం: స్ట్రోక్‌ ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు మింగడంలో (''డిస్ఫాజియా'') ఇబ్బంది పడవచ్చు. డిస్ఫాజియా ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు తమ వాయునాళం / ఊపిరితిత్తుల్లో ఆహారం అడ్డుపడవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి.
> డిప్రెషన్‌: స్ట్రోక్‌ తరవాత వ్యక్తులు చాలాసార్లు కుంగిపోతారు. కనుక రికవరీ కష్టంగా మారుతుంది. స్ట్రోక్‌ తరువాత డిప్రెషన్‌కు చికిత్స సాధారణంగా సిఫారసు చేయబడుతుంది.
> మూత్రాశయంలో సమస్యలు: మూత్రాశయాన్ని నియంత్రించడంలో ఇబ్బంది ఉండటం వల్ల మూత్రం కారడానికి కారణమయ్యే ''మూత్ర నిరోధం'' అని పిలువబడే పరిస్థితికి దారితీయవచ్చు. ఇది తరచుగా కాలక్రమేణా మెరుగవుతుంది.
> స్ట్రోక్‌ ప్రమాద కారకాలను ఎక్కువ సందర్భాలలో నియంత్రణ చేయవచ్చు.
> ప్రమాదాలను తగ్గించడానికి వారి జీవనశైలి ప్రవర్తనలను సవరించుకోవడం, సరైన వైద్యాన్ని సరైన సమయంలో పొందగలిగితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ పెద్ద సమస్య కాదు.

  • ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ..
  1.  ఎవరిలో స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
  2.  వయస్సు: 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు యువకులతో పోల్చుకుంటే స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  3.  స్త్రీ పురుష భేదం : సాధారణంగా మహిళల్లో కంటే పురుషుల్లో స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువ. పురుషుల కంటే మహిళల్లో స్ట్రోక్‌ కారణంగా మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  4. హార్మోన్లు: ఈస్ట్రోజెన్‌ కలిగి ఉన్న హార్మోన్‌ మందులు వాడే వారికి, గర్భనిరోధక మాత్రలను వాడే వారికి ఊబకాయం లేదా అధిక బరువు ఉండేవారికి.
  5.  జీవనశైలిలో స్తబ్ధత (sedentary lifestyle) ఉన్నవారికి. పొగ తాగే వారికి. మాదకద్రవ్యాలు, మద్యం సేవించే వారికి.
  6.  అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం ఉన్న వారికి.
  7. గుండె కొట్టుకోవడంలో తేడాలున్న వారికి. గుండె సంబంధిత వ్యాధులున్న వారికి.
  8. యాంటీకోయాగ్యులెంట్‌లు / బ్లడ్‌ థిన్నర్లు దీర్ఘకాలం ఉపయోగించేవారికి.
  9.  గతంలో స్ట్రోక్‌, మినీ స్ట్రోక్‌ వచ్చినవారికి / అటువంటి కుటుంబ చరిత్ర కలిగిన వారికి.
  10. ప్రమాదవశాత్తు తలకు గాయాలు తగిలిన వారికి.
  • ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖ్యమైన జాగ్రత్తలు..
  1. రక్తపోటును (బిపి) సాధారణ పరిధిలో ఉంచుకోవాలి.
  2.  ధూమపానం చేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.
  3.  పొగాకు సంబంధిత అలవాట్లను మానుకోవాలి.
  4. షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర మోతాదును (గ్లూకోజ్‌) అదుపులో ఉంచుకోవాలి.
  5. గుండె జబ్బు ఉంటే అలసత్వం చేయకుండా చికిత్సను కొనసాగించాలి.
  6. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని సాధారణ పరిధిలో ఉంచుకోవాలి.
  7. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
  8. శరీరం చురుకుగా ఉండే విధంగా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
  9. ఆరోగ్యానికి హానికరంగా మారుతున్న ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి.
  10. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

- డాక్టర్‌ ఎం.వి. రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక, ఆంధ్రప్రదేశ్‌ కమిటీ