స్వేచ్ఛ- ఊహల విశ్వంలో రెక్కల ఆకాశం
స్వాతంత్య్రం
ఊపిరి సముద్రంలో పక్షుల ప్రతిబింబం
పౌరుడా! నీటి ఊటవి నీవు
నీ నుంచే నదులూ.. సముద్రాలు..
సమస్త అధికార ఆవరణల దరిదాపుల్లో
పదవులూ.. హౌదాలూ..
ప్రాతినిధ్య పరిచే జలవి నీవు!
నీ ఆనంద రహస్యం స్వేచ్ఛ
నీ స్వేచ్ఛ కిటుకు ధైర్యం
నీలో పక్షితనం పంజరంలో ఉంటే
స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డట్టే!
అన్ని నిర్బంధతలకు లొంగిపోయి
తలొగ్గడం స్వేచ్ఛ కాదు
ఊహను మించిన అవధి లేదు
మనసుకి రెక్కలివ్వు
స్వేచ్ఛను హరించే అన్ని హద్దుల్ని
దాటి ఎగరనివ్వు ...
స్వేచ్ఛ అచ్చంగా గాలి లాంటిదే!
ఊపిరాడని స్థితిలో చిక్కుకున్నప్పుడు
దాని విలువేమిటో గ్రహింపుకొస్తుంది
చేతికున్నవో కాళ్ళకున్నవో
కనిపించేవో కనిపించనివో
సంకెళ్లను తెంచుకోకుండా
దోపిడి సముద్రాలను ఈదలేవు
పీడన పంజరాలను దాటలేవు ...
చైతన్యపు నదుల్లో
నీరు ప్రసాదమైనపుడు
సాగరాల్ని సైతం పీల్చే
నిర్బంధాల మహా విపత్తు
ఎటు చూసినా ఎద్దడి.. ఎడారి..
వీరుడా! జర జాగ్రత్త
అధికారం
ప్రజల చేతిలో ప్రగతి చక్రం
నియంతల చేతిలో ఇనుప సుత్తి
ప్రజలే ప్రభువులని
సూక్తులు చెప్పే ప్రభువులకు
ప్రజలే బలిపశువులు.. బకరాలు..
అడ్డదారులకు అడ్డంగా మొలిచి
ప్రశ్నలయి వెలుగుతున్న దీపాల్ని
అదృశ్య ఖద్దరు గద్దింపులతో
పగలగొడుతుంటారు
వెలుతుటి నెత్తురు పలుచటి ధారగా
నదుల్లో కలుస్తుంది
వాటి పరివాహక ప్రాంతమంతా
పున్ణ చక్రీయంగా
సారవంతమవుతుంది -
తల విదిల్చి లేచిన తడి మట్టిలో
తారలు మొలిచిన నేలలో
మహా పదునుగా మెరుస్తూ
కొన్ని పాత ప్రశ్నలు
మరెన్నో కొత్త ప్రశ్నలు
ప్రశ్నల కుత్తుకల్ని కత్తిరిస్తే
వాటి నెత్తుటి చుక్కలు యింకిన నేలలో
రక్తపు గింజలన్నీ మళ్లీ
ప్రశ్నలయి మొలుస్తాయి -
నాగరిక జీవనంలో
నిగూఢ నియమం స్వేచ్ఛ
ఏ ప్రజాస్వామ్య దేశానికయినా
రెండో రాజ్యాంగం ప్రశ్న!
- కంచరాన భుజంగరావు
94415 89602










