Mar 20,2023 07:34

ఎన్నో కన్నీళ్లు, ఎంతో శ్రమ
ఎరువుగా వేసి పెంచుకున్న కుసుమం
ఒక్క లీకు పురుగుతో
పూయకుండానే నేల రాలింది
పరిమళం మట్టిపొరల్లో బొందపెట్టబడింది
చుట్టూ చెదపురుగులే చేరిపోయి
వ్యవస్థ కాండాన్ని కసిదీరా పీల్చేస్తుంటే
కలలు గిడసబారక ఏం జేస్తాయి?

ప్రతిదీ డబ్బుతోనే కొనగలమనే
అహంకారం వాడిదైతే
ప్రతిదీ అమ్మకానికే పెట్టగలం
అన్న అమాయకత్వం
ఆత్మాభిమానంలేని గొర్రెలదైతే

గెలుపులన్నీ ప్రాణపసలేని
తోలు తిత్తులుగాను
పరీక్షలన్నీ జీవితాల్ని తలకిందులు చేసే
చిత్తు కాగితాల్లానూ మిగిలిపోతాయి

మనుషులెప్పుడో మాయమైపోయి
నోట్ల కట్టల కిందపడి
మరణిస్తున్న నీతి సూత్రాలు
దారప్పోగుల్లా తెగిపోతున్న భవిష్యత్తు కలలు

కొనీ కొనీ వాడు కొండంత
పెరిగిపోతూనే వుంటాడు
అమ్ముకునీ అమ్ముకునీ
నీ ఒంట్లో అవయవాలు కూడా
మిగలని బేరానికి బలై
నువ్వే భూస్థాపితమైపోతావు

ప్రతిదీ అమ్మకపు సరుకైనచోట
జీవితాశల పున్నాగ పూలూ
లీకుల ఈదురుగాలికి
నేలరాలిపోతుంటాయి
ప్రతిదీ కొనగలమనే
ధీమా పరుచుకున్నచోట
మన వ్యక్తిత్వాలతో పాటు
మన ఒంట్లోని అవయవాలు కూడా
అంగడి సరుకులై
మన బతుకులే నిత్యం
ఓడిపోతూ వుంటాయి

అయినా, ఆఖరి ఆశల పూలనూ
నిలువరించగలిగే
ఇంకా కొన్ని పిడికిళ్లు
గాలిలోకి లేచే వున్నాయి
వందగొడ్లను తిన్న రాబందు కూడా
క్షణాల్లో రాలిపోయే గాలివానొకటి
రూపుకడుతూనే వుంది
 

- చిత్తలూరి కవిత్వం