May 07,2023 11:01

 కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 140 సీట్లకు పైగా గెలుస్తుందని కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డికె శివకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు సౌకర్యవంతమైన మెజారిటీ వస్తుందని, 1978లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించినట్లే ఈ విజయం లోక్‌సభ ఎన్నికలకు తలుపులు తెరుస్తుందని అన్నారు. బిజెపి మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్‌ కోడ్‌, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ వంటి వివాదాస్పద అంశాలను లేవనెత్తడం రాష్ట్రం పట్ల బిజెపి ఆలోచనలను చూపుతుందని మండిపడ్డారు. కర్ణాటకపై బిజెపికి ఎజెండా, విజన్‌ లేవని విమర్శించారు. సిద్ధరామయ్యకు, తనకు సిఎం పదవి విషయంలో అంతర్గత పోరు ఉందంటూ వస్తున్న కథనాలన్నీ మీడియా సృష్టించినవేనని, వాటిలో నిజం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చేలా తాము సంయుక్తంగా కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ఉన్నందున, కర్ణాటకలో పార్టీ మెజారిటీ సాధించేలా చూడడమే తన మొదటి ప్రాధాన్యత అని శివకుమార్‌ అన్నారు. 'బిజెపి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల విషయంలో సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేకపోయింది. ఇప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలతో సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో ఇది పనికిరాదని, ప్రజలు వాటిని తుడిచివేస్తారని ఆయన పేర్కొన్నారు. 'కర్ణాటక బిజెపికి దక్షిణాదికి గేట్‌వే' అన్న ప్రశ్నకు శివకుమార్‌ మాట్లాడుతూ, ''రాష్ట్రంలో పనితీరు లేకపోవడం, అవినీతి, పెద్ద ఎత్తున నిరుద్యోగం కారణంగా కర్ణాటక ప్రజలు బిజెపి ముఖంపై గేటు మూసివేసారు'' అని అన్నారు.