వికలాంగుల సామాజిక సంక్షేమ సాధికారతే నా లక్ష్యం : వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ పఠాన్
ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్ : ఏపీ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ ముంతాజ్ పఠాన్ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మిగనూరుకు విచ్చేసిన సందర్భంగా తాలుకా "విహెచ్ పిఎస్" గౌరవాధ్యక్షులు, సామాజిక కార్యకర్త, మల్లేల గ్రూపు అధినేత ఆల్ఫ్రెడ్ రాజు పిలుపు మేరకు ఆయన స్వగృహం నందు మర్యాద పూర్వకంగా కలిశారు. తదుపరి ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన "వికలాంగుల సంక్షేమ కమ్యూనిటీ హాలు"ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సమితి గౌరవాధ్యక్షులు మల్లేల ఆల్ఫ్రెడ్ రాజు, ఎమ్మిగనూరు మండల ఎంపిపి గొల్ల కేషన్న, విహెచ్ పిఎస్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బిసి.నాగరాజులు వికలాంగుల సంక్షేమ హక్కుల గూర్చి, పలు సమస్యలు గూర్చి, ప్రభుత్వం ద్వారా వికలాంగులకు అందించాల్సిన న్యాయపరమైన, చట్టబద్ధమైన, సామాజిక సేవల గూర్చి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని, వీటిని తప్పకుండా ప్రభుత్వం ద్వారా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే త్వరలో రాష్ట్ర స్థాయి వికలాంగుల సంక్షేమ సంఘాల ముఖ్య నేతలు, నాయకులతో వికలాంగుల పలు సమస్యలు, ఇబ్బందుల గూర్చి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి యు.వీరేష్, విహెచ్ పిఎస్ మాజీ కార్యదర్శి వై.నర్సింహులు, కల్గట్ల రాజశేఖర్, గుడికల్ రంగన్న, కేషన్న, నర్సింహులు, బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.










