కర్నూలు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామం వద్ద 44 వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ లో పని చేస్తున్న సుజిత్ కుమార్ తన స్నేహితుడు గోవర్ధన్ రెడ్డి తో కలిసి ఎపి 21 బి ఎక్స్ 0307 కారులో అనంతపురం వైపు వెళ్తున్నారు. రాత్రి ఒకటిన్నర సమయంలో కారు అదుపుతప్పి పెద్దటేకూరు గ్రామ సమీపంలోని రోడ్డు డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ఎంహెచ్ 94బిఎల్ 6565 నెంబరు ఉన్న లారీని ఢకొీంది. అతివేగంగా వెళుతున్న కారు లారీ ముందు భాగంలో దూసుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సుజిత్ కుమార్, గోవర్ధన్ రెడ్డి లు అక్కడికక్కడే మరణించారు. లారీ బోల్తాపడింది. ఈ సమాచారం తెలుసుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ అధికారులు, ఉలిందకొండ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అప్పటికే మృతి చెంది కారులో ఇరుక్కుపోయిన సుజిత్ కుమార్, గోవర్ధన్ రెడ్డి ల మృతదేహాలను హైవే పెట్రోలింగ్ సిబ్బంది, క్రేన్ సాయంతో అయిదు గంటల సేపు శ్రమించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలతో వారి బంధువులకు పోలీసులు సమాచారాన్ని అందజేశారు.










