
లాహోర్ : భారత్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరైన పరంజిత్ సింగ్ పంజ్వర్ (63) లాహోర్‌లో హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పాకిస్తాన్ పోలీసులు తెలిపారు. పంజ్వార్ భారత్‌లో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ -పంజ్వార్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 2020 జులైలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద భారత ప్రభుత్వం టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
సాయుధ దుండగులు పంజ్వార్ సింగ్ తలపై కాల్చి చంపారని, అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించినట్లు పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అతని సెక్యూరిటీ గార్డు కూడా కాల్పుల్లో గాయపడ్డాడని.. చికిత్స పొందుతూ మరణించాడని అన్నారు. ఐఎస్‌ఐ, మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ), సరిహద్దు ఉగ్రవాద నిరోధక సంస్థ (సిటిడి)తో పాటు పాకిస్తాన్ నిఘా సంస్థలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయని చెప్పారు. అయితే ఆప్రాంతానికి మీడియాను అనుమతించలేదని సమాచారం. ఈ హత్య భారత్ వెలుపల ఉగ్రవాద చీఫ్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు తాజా ఉదహరణ. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని రావల్పిండిలో హిజ్బుల్ ముజాహుద్తీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ బషీర్ అహ్మద్ పీర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు.