ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్నాయి. అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, పాకిస్తాన్ ఎన్నికల సంఘం గురువారం ఈ మేరకు ఒక అంగీకారానికి వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇరువురి మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో పాక్ ఎన్నికలపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. అధ్యక్షుడితో సమావేశం అయిన తరువాత ప్రధాన ఎన్నికల కమిషనర్ రజా అధ్యక్షునికి పంపిన లేఖలో సాధారణ ఎన్నికలు పిబ్రవరి 11న జరపాలని ప్రతిపాదించారు. లేఖ అందిన గంట తరువాత అధ్యక్ష భవనం ఒక ప్రకటన చేస్తూ, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి చెందిన నల్గురు కమిషనర్లు అధ్యక్షునితో సమావేశమయ్యారని, ఫిబ్రవరి8న ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగిందని తెలియజేసింది. దీంతో ప్రధాన ఎన్నికల అధికారి ఒక ప్రకటన చేస్తూ అధ్యక్ష భవనం చేసిన ప్రకటనతో ఏకీభవిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఫిబ్రవరి 11 న నిర్వహించతలపెట్టినట్లు పాక్ ఎన్నికల కమిషన్ గురువారం ఉదయం సుప్రీం కోర్టుకు తెలపగానే, దీనిపై దేశాధ్యక్షునితో ఒకసారి కూర్చొని తేదీని ఖరారు చేయమని సుప్రీం న్యాయమూర్తులు సూచించారు. 2024 జనవరి 29 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది సజీల్ స్వాతి సుప్రీంకోర్టుకు తెలిపారు. పాక్ జాతీయ అసెంబ్లీ, రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసిన తరువాత 90 రోజుల్లోగా ఎన్నికలు జరపాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) గడువు ముగియడానికి రెండు రోజుల ముందు అంటే ఆగస్టు9న రద్దు చేస్తూ ప్రభుత్వం సిఫారసు చేసింది.