ప్రజాశక్తి-పొందూరు: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెండేలా త్రినాధరావు కోరారు. గురువారం పొందూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఏలు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి, రికవరీ చేసిన డిఏ ను తిరిగి చెల్లించాలి, నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను వీఆర్ఏలుగా గుర్తించాలి, మరణించిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలి, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు బి.ఈశ్వరరావు, సెక్రటరీ వైకుంఠరావు, పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.










