- ఉత్తరాంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
- ప్రాంతం పేరుతో అవమానిస్తే జిల్లాకు చెందిన మంత్రులు స్పందించరేంటని ప్రశ్న
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ అభిమానులు చేపట్టిన సైకిల్ ర్యాలీని అభ్యంతరకర రీతిలో అడ్డుకోవడాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు. ఉత్తరాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లైదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే.. వైసీపీ మంత్రుల పరిస్థితి ఏంటని ఎదురు ప్రశ్నించారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రణస్థలం మండలానికి చెందిన టీడీపీ అభిమానులు రామకృష్ణ తదితరులు గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే... చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వైసీపీ నాయకులు వారిని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడంతో పాటు అభ్యంతరకరంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. ప్రాంతం పేరుతో దూషించడం, నడి రోడ్డుపైనే బట్టలు విప్పించడం అమానుషమన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చేసిన ఈ దాడి, ప్రజాస్వామ్య విలువలను పాతర వేసే విధంగా ఉందని ఆక్షేపించారు. ప్రాంతాలు, సంస్కృతులు, యాస వేరైనా.. అందరిదీ తెలుగు భాషేనని, ఆత్మీయత, గౌరవ మర్యాదలతో మన రాష్ట్రానిది ఎప్పుడూ అగ్రస్థానమేనని గుర్తు చేశారు. అయితే ప్రాంతాల పేరుతో వైషమ్యాలు తీసుకువస్తున్న వైసీపీ మంత్రులు, నాయకులు.. విశాఖలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. జిల్లాకు చెందిన వ్యక్తులను ప్రాంతం పేరుతో అవమానిస్తే.. స్థానిక మంత్రులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధిత టీడీపీ నాయకులకు క్షమాపణలు చెప్పాలని, అలాగే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.