Sep 19,2023 16:28

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో ఓటర్ల తొలగింపు పునఃపరిశీలన కార్యక్రమం పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు. మంగళవారం  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మచిలీపట్నంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 6-1-2022 నుండి తొలగించిన ఒక లక్ష 980 ఓట్లకు సంబంధించి పునః పరిశీలన పూర్తి చేసామని అన్నీ తొలగింపు కేసులకు సంబంధించి జారీ చేసిన నోటీసులు, బూత్ స్థాయి అధికారుల పరిశీలన నివేదికలు జాగ్రత్తగా దస్త్రాలలో భద్రపరిచామన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తొలగింపు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఇరువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి 20,766 అనర్హులైన ఓటర్లపై ఫిర్యాదులందాయని వాటిని క్షుణ్ణంగా విచారించామని, అందులో 12,401 ఓటర్లు నిజమైనవిగా తేలిందన్నారు. మిగిలినవి మృతి చెందిన, వలస పోయిన ఒకటి కంటే ఎక్కువ నమోదైన ఓటర్లు ఉన్నారన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు అధికారుల( ఈఆర్వోల)స్థాయిలో పరిశీలన పూర్తయిందన్నారు. మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గాల్లో కొంత పెండింగ్ ఉందని నోటీసు కాలం ఉన్నందున 5 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో ఫారం 6, 7 క్లేయిముల పరిష్కారంలో గత సమావేశం కంటే ఈసారి పురోగతి సాధించామన్నారు.  ఫారం 6లో 39,723 క్లెయిములు రాగా అందులో 37,798 క్లేయిములు పరిష్కరించామని, ఇంకా 5 శాతం అనగా 1925 క్లెయిములు  పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం 7 లో 26,660 క్లెయిములు రాగా 21,283  పరిష్కరించామని 20% అనగా 5,377 పెండింగులో ఉన్నాయన్నారు. ఫారం 8లో 40,944 క్లెయిములు రాగా 37,111 క్లెయిములు పరిష్కరించామని ఇంకనూ 9 శాతం అనగా 3,833 పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిములను కూడా త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఇంటింటి సర్వే కార్యక్రమం కొంత సమస్య ఉందని మచిలీపట్నం ఈఆర్ఓ  కారణాలతో సెలవు పెట్టారన్నారు. మచిలీపట్నంలో మృతి చెందిన, వలస పోయిన, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఓటర్ల సర్వే త్వరలో పూర్తి చేస్తామన్నారు .వ్యత్యాసాల పరిశీలనలో భాగంగా ఒక ఇంటిలో పదికి మించిన ఓటర్లకు సంబంధించి 4,556 ఇళ్లను పరిశీలించామని, 67,274 ఓటర్లను విచారించామని 11,876 మంది నుండి క్లెయిమ్ ఫారములు సేకరించి 11,320  ఈఆర్ఓ నెట్లో అప్డేట్ చేశామని, ఇంకను 556 ఫారములు అప్డేషన్ కోసం పెండింగ్లో ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు సంబంధించి ఈఆర్వోలు అందరూ అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వాటిపై చర్చించి పంపాలని సూచించామన్నారు. ఈనెల 22వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆ ప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం తహసిల్దార్ సురేష్, డిటి శ్యామ్ ,ఐటి నిపుణురాలు సుధా పాల్గొన్నారు.