Nov 09,2023 11:06

ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌ : బాపులపాడు మండలం తహశీల్దారుగా డి.సునీల్‌ బాబు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా బాపులపాడు తహశీల్దార్‌ పోస్ట్‌ ఖాళీగా ఉండటంతో గన్నవరం తహశీల్దార్‌ సిహెచ్‌ నరసింహారావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపులపాడు తహశీల్దార్‌ గా సునీల్‌ బాబు ను నియమిస్తూ జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని నెలల కిందట సునీల్‌ బాబును బాపులపాడుకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆయన విధుల్లో చేరలేదు. మండలంలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇతరత్రా భూ సమస్యలు పెండింగ్‌ లో ఉన్న నేపథ్యంలో నరసింహరావునే కొనసాగించాలని కీలక ప్రజాప్రతినిధి పట్టుబట్టారు. కలెక్టర్‌ మాత్రం సునీల్‌ బాబును విధుల్లో చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చినా, చివరకు డిప్యుటేషన్‌ పై ఉయ్యూరుకు వెళ్లారు. తాజాగా గత నెల 26న సునీల్‌ బాబు డిప్యుటేషన్‌ రద్దు చేసి, బాపులపాడు తహశీల్దార్‌ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం బాపులపాడు తహసీల్దార్‌ గా బాధ్యతలు చేపట్టారు. నూతన తహశీల్దార్‌ సునీల్‌ బాబుకు కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవిన్యూ సహాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు. అనంతరం ఆయన గుడివాడ ఆర్టీవో పద్మావతిని మర్యాదపూర్వకంగా కలిశారు.