Oct 09,2023 15:47
  • ఉద్యోగుల నిరసన ప్రదర్శన - కమిషనర్‌, పోలీసులకు ఫిర్యాదు

ప్రజాశక్తి - చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : వార్డు సచివాలయ అడ్మిన్‌పై దాడి చేసిన వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో సచివాలయ ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 1 వార్డు సచివాలయంలో అదే ప్రాంతానికి చెందిన వినోద్‌ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఆరోగ్య సురక్ష పథకం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలని వినోద్‌కు సచివాలయ అడ్మిన్‌ భూదాటి శ్రీనివాస్‌ పలుమార్లు చెప్పారు. అయినా పనిలో పురోగతి లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద ఆయనకు సెప్టెంబర్‌ జీతాన్ని ఆపేశారు. దీనిపై శనివారం సచివాలయంలో ఇద్దరికీ వాగ్వాదం తలెత్తింది. వాటర్‌ పైపుతో అడ్మిన్‌పై వలంటీర్‌ దాడి చేశారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో పట్టణంలోని సచివాలయ ఉద్యోగులంతా సోమవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా వెళ్లరు. వలంటీర్‌ వినోద్‌ను విధుల నుండి తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎపిజిఇఎఫ్‌) జిల్లా కార్యదర్శి ఎ శ్రీధర్‌రెడ్డి, నాయకులు విజయలక్ష్మి, ప్రతాప్‌కుమార్‌, సాగర్‌, కృష్ణ, నాగేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. వలంటరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు.