
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎపిఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎపి ఎన్‌జిఒ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డి జానిపాషా మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని ప్రయత్నం కొనసాగిస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరినప్పటి నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఉద్యోగులకు యూనిఫారమ్ తొలగించాలని, సచివాలయ ఉద్యోగులందరికీ ప్రమోషన్ ఛానెల్ కల్పించాలని, రికార్డు అసిస్టెంట్ పేస్కేల్‌ను తొలగించి జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలని, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్‌జిఒ అధ్యక్షులు విద్యాసాగర్ పాల్గొన్నారు. సమావేశనాంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
- ఫెడరేషన్ అధ్యక్షులుగా జానిపాషా
ఎపి గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఎమ్‌డి జానిపాషాతోపాటు 21 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పుట్టి రత్నం, ఉపాధ్యక్షులుగా ఎస్ హరి, కె రామకృష్ణారెడ్డి, జి హరీంద్ర, పిజె గణేష్‌కుమార్, కోశాధికారిగా బి పుల్లారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎస్‌కె మహబూబ్‌సుభాని, టి కోటేశ్వరరావు, కార్యదర్శులుగా ఎం శాంతి సాగర్, డి సురేష్‌బాబు, కె విజరుమోహన్, బి శ్వేత, సంయుక్త కార్యదర్శులుగా పి శ్యామియేలు, టి తిరుమలయ్య, పి హనుమేష్, కె మురళీకృష్ణ, ప్రచార కార్యదర్శులుగా ఎం ధనశేఖర్, ఆర్ జాన్‌తోపాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు.