Jul 14,2023 14:19

కౌంటింగ్ కేంద్రం వెలుపల గోడ పక్కన ప్రిసైడింగ్ అధికారి సంతకంతో కూడిన బ్యాలెట్ పత్రాలు కనిపించాయి. వాటిలో చాలా వరకు ఓట్లపై సీపీఐ(ఎం) గుర్తు ముద్రించివుంది. పూర్వస్థలి-2 బ్లాక్‌లోని కౌంటింగ్ కేంద్రం దగ్గర పడి ఉన్న సిపిఐ(ఎం) ఓట్లను గుర్తించారు. తూర్పు బుర్ద్వాన్‌లోని ఈ బ్లాక్‌కు సంబంధించిన కౌంటింగ్ కేంద్రం పటులి కిషన్ మండిలో జరిగింది. ఓట్ల లెక్కింపు అనంతరం కిషన్‌ మండి గోడల పక్కన పడి ఉన్న బ్యాలెట్‌ పత్రాల దొంతరలను గుర్తించారు. బ్యాలెట్ పేపర్లలో సీపీఐ(ఎం) గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటరు ముద్రలను స్థానికులు గుర్తించారు.
సీపీఐ(ఎం) స్థానిక నాయకులు మాట్లాడుతూ... ప్రతి బ్యాలెట్ పేపర్‌పైనా ప్రిసైడింగ్ అధికారి సంతకం ఉంటుంది. ఓటు వేసేటప్పుడు బ్యాలెట్ పేపర్‌పై సంతకం చేస్తారు. ఈ బ్యాలెట్ పత్రాలు కరిగర్ పారాలోని పూర్వస్థలి గ్రామ పంచాయతీలోని బూత్ నంబర్ 228కి చెందినవిగా వారు పేర్కొన్నారు. ఇక్కడనుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీచేసిన మరియా బీబీ షేక్ కేవలం మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని సిపిఎం నాయకులు తెలిపారు.
సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌లు నామినేషన్‌లు వేసిన నాటి నుంచే వారి దోపిడీ ప్రక్రియ మొదలైందన్నారు. ఈ దోపిడీ ప్రక్రియలో తృణమూల్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పాలుపంచుకుందని వారు ఆరోపించారు. ప్రతిపక్షాల అభ్యర్థులకు అనుకూలమైన ఓట్లను బయటకు విసిరేశారని, అయినప్పటికీ ప్రతిపక్ష అభ్యర్థి గెలిచిన చోట సర్టిఫికెట్ ఇవ్వలేదని అన్నారు. తృణమూల్ డిమాండ్ మేరకు ప్రతిపక్ష ఏజెంట్లను బహిష్కరించి మళ్లీ కౌంటింగ్ చేపట్టారని, ఆ తర్వాత తృణమూల్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని అన్నారు.

2

సీపీఎం పూర్వస్థలి-2 ఏరియా కమిటీ సభ్యుల్లో ఒకరైన కార్తీక్ దాస్ మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు జరుగుతాయని మేం ముందే ఊహించాం. ఓట్ల లెక్కింపు రోజున బ్యాలెట్ బాక్సులను తీసుకురావడానికి తాత్కాలిక ఉద్యోగులను ఉపయోగించవద్దని పూర్వస్థలి-2 BDOను కోరాము. అయినా... ఆయన మా విజ్ఞప్తిని అంగీకరించలేదని కార్తీక్ దాస్ తెలిపారు.
దీనిపై స్పందించిన BDO సౌమిక్ బాగ్చి మాట్లాడుతూ... "నాకు విషయం అర్థం కాలేదు. ఇంత బందోబస్తు ఉన్నప్పటికీ ముద్రించిన బ్యాలెట్ పేపర్లు బయట ఎలా దొరికాయో పరిశీలించాలని’’ అన్నారు.