Oct 27,2023 11:27

కోల్‌కతా :   పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి చెందిన మరో మంత్రిపై కేంద్రం వేటు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో (పిడిఎస్‌) అక్రమాలకు పాల్పడ్డారనే అరోపణలతో అటవీశాఖ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి ) అరెస్ట్‌ చేసింది. ఆయన పిడిఎస్‌ ఇన్‌చార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. గురువారం నుండి సుమారు 20 గంటల పాటు ఆయనకు చెందిన ఎనిమిది ప్లాట్లలో ఈడి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సాల్ట్‌లేక్‌లో ఉన్న ఆయన నివాసం నుండి శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

''కుట్రలో నేను బాధితుడిని'' అని అరెస్ట్‌ సమయంలో జ్యోతిప్రియా మల్లిక్‌ మీడియాతో పేర్కొన్నారు. తన అరెస్ట్‌లో ప్రతిపక్ష బిజెపి నేత సువేందు అధికారి పాత్ర ఉందని అన్నారు. ఈ కేసు 2020-21 నాటిది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసుల విచారణ అనంతరం ఈడి ఈకేసును చేపట్టింది. ఇదే కేసుకు సంబంధించి జ్యోతిప్రియా మల్లిక్‌ సన్నిహితుడు, వ్యాపారవేత్త బాకీబుర్‌ రెహ్మన్‌ను ఈడి గతవారం అరెస్ట్‌ చేసింది. ఆయన పేరిట సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈడి పేర్కొంది.

ఈడి అదుపులోకి తీసుకున్న వారిలో జ్యోతిప్రియా మల్లిక్‌ రెండో సిట్టింగ్‌ మంత్రి కావడం గమనార్హం. గతేడాది ఉపాధ్యాయుల నియామక కుంభకోణంలో విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు విద్యాశాఖ అధికారులు అరెస్టయ్యారు.

మంత్రి నివాసంపై ఈడి దాడులపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన అస్వస్థతతో ఉన్నారని, దాడుల సమయంలో అయనకు ఏమైనా జరిగితే తాను ఇడి, బిజెపిలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తానని అన్నారు.