
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ఆహార శాఖ మంత్రి రతిన్‌ఘోష్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి మంత్రి నివాసంలో గురువారం ఉదయం నుండి ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కోల్‌కతాలోని మంత్రి నివాసంతో పాటు 13 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. గతంలో రతిన్ ఘోష్.. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో పెద్దసంఖ్యలో అనర్హులకు ఉద్యోగాలు ఇప్పించినట్లు ఈడి పేర్కొంది. వీటి కోసం ఘోష్‌తోపాటు అతని సహచరులు అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈడి విచారణ చేపడుతోంది. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయుల నియామకాల కేసులో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడి మరోసారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆయన భార్య రుజిరాకు కూడా నోటీసులు పంపింది.