Nov 03,2023 12:33

జైపూర్‌ :   మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని 25 ప్రాంతాలు మరియు దౌసా, ఎసిఎస్‌తో పాటు పిహెచ్‌ఇ డిపార్ట్‌మెంట్‌లలో సోదాలు జరుపుతున్నారు. జలజీవన్‌ మిషన్‌ స్కామ్‌పై మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే కేసులో సెప్టెంబర్‌లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.

శ్రీ శ్యామ్‌ ట్యూబ్‌వెల్‌ కంపెనీ యజమాని పదమ్‌చంద్‌ జైన్‌, శ్రీ గణపతి ట్యూబ్‌ వెల్‌ కంపెనీ యజమాని మహేష్‌ మిట్టల్‌ మరియు మరి కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇచ్చారని రాజస్తాన్‌ అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) ఎన్‌ఐఆర్‌లో పేర్కొంది. ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్‌ విభాగం (పిహెచ్‌ఇడి) నుండి టెంటర్లు పొందడం, బిల్లులు మంజూరు చేయడం, అక్రమాలను కప్పిపుచ్చడం వంటి చర్యలు చేపట్టారని పేర్కొంది.

ఈడి దాడులపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశానుసారం ఈడి ప్రతిపక్షాల సభ్యులే లక్ష్యంగా ఈడి దాడులు చేపడుతోందని అన్నారు.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం, తెలంగాణలతో పాటు రాజస్తాన్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 200 అసెంబ్లీ స్థానాలు కలిగిన రాజస్తాన్‌లో ఈ నెల 25న ఒకేదశలో పోలింగ్‌ జరగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపుచేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.