Nov 19,2023 08:22
  • కాంగ్రెస్‌, బిజెపిలకు అసమ్మతి నేతల దెబ్బ
  • ఇండిపెండెంట్లుగా పలువురు రంగంలోనే !

అత్యంత కీలక రాష్ట్రమైన రాజస్థాన్‌ శాసనసభా స్థానానికి ఎన్నికలు మరో వారం రోజుల్లో.జరగనున్నాయి. ఇక ప్రచారానికి ఐదారు రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్‌ తరపున సోనియా, రాహుల్‌, ఖర్గే, ప్రియాంక, బిజెపి తరపున మోడీ, నడ్డా, అమిత్‌షా వంటి నేతలు విడతల వారీగా ప్రచారం నిర్వహించి రాజకీయ వేడిని పెంచారు. ప్రస్తుతం ఇక్కడ ...అశోక్‌ గెహ్లాట్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తుండగా, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బిజెపి ఉవ్విళ్లూరుతోంది. రాజస్థాన్‌లో మొత్తం 200 శాసనసభా స్థానాలకు ఈనెల 25న ఒకే విడతలో పోలింగ్‌ జరగనున్నది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 1875 మంది బరిలో ఉన్నారు. వీరిలో 183 మంది మహిళలు. జోత్వారాలో అత్యధికంగా 18 మంది, దౌసా జిల్లా లాల్‌సోట్‌లో ..అత్యల్పంగా.. ముగ్గురు మాత్రమే పోటీలో ఉన్నారు.
 

                                                             సామాజిక తరగతుల ప్రాబల్యం ఎక్కువే !

సామాజిక తరగతుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ కీలక రాష్ట్రంగా చెప్పవచ్చు. జాట్‌లు, గుజ్జర్లు, రాజ్‌పుత్‌లు, ఎస్సీలు రాష్ట్ర జనాభాలో కీలకంగా ఉన్నారు. ఒకవైపు మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ప్రభావం ఈసారి గణనీయంగా ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ఏ పార్టీ అయినా వరుసగా రెండోసారి అధికారంలోకి రాదన్న ఆనవాయితీని బ్రేక్‌ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా, ఆనవాయితీ కొనసాగి ప్రజలు తమకే పట్టం కడతారని బిజెపి భావిస్తోంది. ప్రత్యేకించి ఫలానా సామాజిక తరగతి వారు తమకే ఎప్పుడూ మద్దతుగా ఉన్నారని పాలక పార్టీలు చెప్పుకుంటున్నా.. అది వాస్తవం కాదు..ఏ సామాజిక తరగతికి చెందిన వారైనా గుంపగుత్తగా బిజెపిని గానీ, కాంగ్రెస్‌ను గానీ ఏకపక్షంగా గెలిపించిన సందర్భాలు లేవు. జాట్‌లు, గుజ్జర్లు, రాజ్‌పుత్‌లు....ప్రధానంగా ..వీరు తమ సామాజిక తరగతికి చెందిన వారే సిఎంగా ఉండాలని, శాసనసభలో అత్యధిక మంది సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ఆయా సామాజిక తరగతులకు చెందిన వారు గత కొన్ని నెలల కాలంలో సభలు నిర్వహించి రాజకీయంగా వత్తిడి తేవడం ప్రారంభించారు. ఉదాహరణకు ...మార్వాడ్‌, శెఖావట్‌ ప్రాంతాల్లో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జాట్‌కు చెందిన వారు రాష్ట్ర అసెంబ్లీకి గత ఎన్నికల్లో 42 మంది ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 50కి పెంచుకోవాలని వారి సభల్లోనే బహిరంగంగానే పిలుపునిచ్చారు. జాట్‌ల కోడలైన వసుంధరారాజేకు ప్రాధాన్యత తగ్గించడం, ఆ సామాజిక తరగతికే చెంది, బిజెపి సిఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సతీష్‌ పునియాను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుండి తప్పించడం పట్ల బిజెపి పట్ల ఈ సామాజిక తరగతి వారు వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అలాగే కొంత కాలం ఎన్‌డిఎతో సంబంధాలు నెరపి ...ఆ తరువాత బయటకొచ్చిన రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పి), జననాయక్‌ జనతాపార్టీ (జేజేపి) ...ఈ సామాజిక ఓట్లను కొంత వరకు బిజెపికి పడకుండా చీల్చవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే తూర్పు రాజస్థాన్‌ప్రాంతంలోని కరోలి, టోంక్‌, దౌసా, హిండౌన్‌ ప్రాంతాల్లో గుజ్జర్ల ప్రభావం గణనీయంగా ఉంది. 2018లో సచిన్‌పైలెట్‌ను సిఎం చేస్తారనే ఉద్దేశ్యం తో వారు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారనీ, అయితే ఆ తరువాత డిప్యూటీ సిఎంకే పరిమితం చేసి...ఆ తరువాత దానినీ వెనక్కితీసుకున్నందున....కాంగ్రెస్‌ పట్ల ఈ సామాజిక తరగతి వారు గుర్రుగా ఉన్నారని చెపుతున్నారు.
 

                                                                      రెండు పార్టీలకూ అసమ్మతి బెడద

బిజెపిలోనూ, కాంగ్రెస్‌లోనూ అసమ్మతినేతల ప్రభావం ఈసారి ఆయా పార్టీలపై గణనీయంగా ఉండొచ్చని చెపుతున్నారు. బిజెపి తరపున గత ఎన్నికల్లో ఒకే ఒక ముస్లిం అభ్యర్థికి మాత్రమే పోటీకి అవకాశం కల్పించారు. ఇప్పుడాయనకూ మొండిచేయే చూపించింది. దీంతో....వసుంధర రాజేకు ముఖ్యఅనుచరుడిగా ఉన్న ఆయన ఇండిపెండెంట్‌గా ఈసారి బరిలో ఉన్నారు. అలాగే మాజీ స్పీకర్‌, బిల్వారా జిల్లాలోని షాపూరా నియోజకవర్గం నుండి ఆరుసార్లు గెలిచిన కైలాష్‌ మేఘవాల్‌కు సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌పై అవినీతి ఆరోపణలు చేసినందుకు ఆయనకు సీటు ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.
           అశోక్‌గెహ్లాట్‌కు సచిన్‌పైలెట్‌, ఆయన అనుయూయుల నుండే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కన్పిస్తోంది. సిఎం పదవికి సంబంధించి కాంగ్రెస్‌ అధిష్టానం....నిర్ధిష్టమైన హామీ ఇస్తే తప్ప గెహ్లాట్‌కు సచిన్‌ పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి లేదు. అలాగే...ఇండిపెండెంట్లుగా రంగంలో ఉండడం లేదా అధికార పార్టీ అభ్యర్ధులకు సహకరించని దాదాపు 49 మందిని ఆ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరించింది.
         తాజా ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పి), జననాయక్‌ జనతాపార్టీ (జేజేపి)ల ప్రభావం కూడా కొంతవరకు ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. 17 స్థానాల్లో . సిపిఎం అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. వీరి తరపున ఇప్పటికే బృందాకరత్‌, సీతారాం ఏచూరి...వంటి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ పార్టీకి అసెంబ్లీలో రెండు స్థానాలున్నాయి.
 

                                                                            తగ్గుతున్న బిజెపి గ్రాఫ్‌

బిజెపి గ్రాఫ్‌ కూడా గత కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో తగ్గుతోంది. గత సాధారణ ఎన్నికల తరువాత జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో సైతం బిజెపిని ప్రజలు ఓడించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వ్యవసాయ చట్టాలు తేవడం, మతోన్మాద చర్యలు, మోడీ-అమిత్‌షా ఒంటెద్దు పోకడలు, వసుంధరరాజే మినహా .... బిజెపిని గట్టెక్కించగల రాష్ట్రస్థాయి నేతలు లేకపోవడం ఆ పార్టీని దెబ్బతీయవచ్చని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు.
 

                                                                 కాంగ్రెస్‌ను వెంటాడుతున్న అవినీతి

కాంగ్రెస్‌లో సచిన్‌పైలెట్‌ ...అసమ్మతి నేతగా ఉండి పలుమార్లు బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై రోడ్డెక్కారు. ఒక దశలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గెహ్లాట్‌గా నియమించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆ పార్టీ అధిష్టానం భావించింది. అయితే అధ్యక్ష పదవితో పాటు ..సిఎంగానూ కొనసాగించాలని గెహ్లాట్‌ మొండికేయడంతో ఎన్నికల ఏడాదిలో నష్టం జరుగుతుందేమోనని భావించి ...ఆ పార్టీ ..అప్పటికి ఆ అంకాన్ని ముగించింది. ఇటీవలి కాలంలో మధ్యాహ్న బోజన పథకంలో అవకతవకలు జరిగాయని మంత్రి రాజేంద్రయాదవ్‌ సహా 9 మంది నేతలు, గెహ్లాట్‌ కుమారుడు, సోదరుని ఇళ్లపై, కార్యాలయాలపైన ఇడి దాడులు నిర్వహించింది. జలజీవన్‌ మిషన్‌కు చెందిన 25 ప్రదేశాలపై ఇటీవల దాడులు నిర్వహించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి ప్రధానాంశంగా బిజెపి ప్రచారాస్త్రాన్ని ఉపయోగిస్తోంది.
          ఏదైమైనా ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న ఈ రెండింటిలో దేనికి విజయావకాశాలున్నాయో తెలియాలంటే డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాల్సిందే. మిగతా పార్టీలు ఉనికిలో ఉన్నా రాష్ట్రమంతటా ప్రభావం చూపే పరిస్థితి లేదు.