Jul 31,2023 22:22
  • వేలాదిగా తరలివచ్చిన ఉక్కు కార్మికులు
  • హోరెత్తిన మోడీ దిగిపో, క్విట్‌ అదానీ నినాదాలు

ప్రజాశక్తి-గాజువాక (విశాఖపట్నం) : 'మా పరిశ్రమ భూములను తీసుకుని మమ్మల్నే ఇబ్బంది పెడతారా.. ఖబడ్దార్‌' అంటూ అదానీ గంగవరం పోర్టు యాజమాన్యాన్ని కార్మికవర్గం హెచ్చరించింది. ఉక్కు ఉత్పత్తికి ఆటంకాలు సృష్టిస్తూ పరిశ్రమ నిర్వీర్యానికి కుట్రలు చేస్తోన్న అదానీ పోర్టు తీరును నిరసిస్తూ సోమవారం వేలాది మంది కార్మికులు 'చలో అదానీ గంగవరం పోర్టు' కార్యక్రమం నిర్వహించారు. బిసి రోడ్డు నుంచి పోర్టు వరకూ ఎక్కడ చూసినా చీమలదండులా వీరే కనిపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్‌.నర్సింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, నాయకులు అయోధ్యరామ్‌, కెఎం.శ్రీనివాసరావు తదితరులు నేతృత్వం వహించారు. తొలుత బిసి రోడ్డు నుంచి పోర్టు సమీపం వరకూ పాదయాత్ర నిర్వహించారు. పోర్టుకు మూడు కిలోమీటర్ల ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. నర్సింగరావు, సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు తోపులాటలో కిందపడిపోయారు. అయినప్పటికీ పట్టువిడవకుండా ముందుకు దూసుకెళ్లారు. వేలాది మంది కార్మికులు రావడంతో ఒకానొక దశలో పోలీసులు చేతులెత్తేశారు. పోర్టు సమీపాన కార్మికులు ధర్నా చేశారు. 'మోడీ దిగిపో, క్విట్‌ అదానీ' నినాదాలు మార్మోగాయి. 'ఈ పోరాటం శాంపిల్‌ మాత్రమే.. అసలైన పోరాటం ఆగస్టు 9న ఉంటుంది' అని నేతలు హెచ్చరించారు. నాలుగు గంటలసేపు ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ అదానీ గంగవరం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ వాటాను తిరిగి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదానీ గంగవరం పోర్టు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆధీనంలో ఉండేలా చూడాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములను తీసుకుని తిరిగి ఆ ప్లాంట్‌కే అన్యాయం చేయడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన కొకింగ్‌ కోల్‌ విషయంలో అదానీ పోర్టు ఎలా వ్యవహరించిందీ తెలియజేశారు. స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. గంగవరం పోర్టు నిర్మాణంతో 20 వేల మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆ పోర్టు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి ఉక్కు కార్మికుల మద్దతు ఎల్లావేళలా ఉంటుందన్నారు. బి.గంగారావు మాట్లాడుతూ అదానీకి కొమ్ముకాస్తున్న బిజెపికి రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు యు.రామస్వామి, వైటి.దాసు, ఐఎన్‌టియుసి నాయకులు నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గన్నారు.

  • సిఎం తన వైఖరిని తెలియజేయాలి : వామపక్షాలు

విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌పై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన వైఖరిని తక్షణం స్పష్టం చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ బి.గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, ఎంసిపిఐ (యు) నాయకులు కె.శంకరరావు, సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపోరు నాయకులు కె.దేవా తదితరులు పాల్గన్నారు.