Nov 22,2023 11:48

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ వాల్వు ఆపరేటర్‌ గోపాల్‌ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి కూడా ఆబ్సెంట్‌ మార్కు రిజిస్టర్‌ లో నమోదు చేయటాన్ని నిరసిస్తూ ... బుధవారం ఇంజనీరింగ్‌ సెక్షన్‌ లో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక యూనియన్‌ ఆధ్వర్యంలో టాప్‌ ఇన్స్పెక్టర్‌ మహబూబ్‌ బాషాను నిలదీశారు. గుండెపోటుతో వాల్వు ఆపరేటర్‌ సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్టంట్‌ వేయించుకున్నారని యూనియన్‌ నాయకులు మల్లికార్జున సంజీవ రాయుడు తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా పనిగట్టుకుని అటెండెన్స్‌ రిజిస్టర్‌ లో ఆబ్సెంట్‌ మార్క్‌ వేయటం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో వర్కర్‌ ప్రమాదాలకు గురైనా, మరణించినా అధికారులు ఎవరూ ఒక్క పైసా సహాయం చేయడం లేదని ధ్వజమెత్తారు. తోటి వర్కర్లే తలా కొంత మొత్తాన్ని పోగుచేసి కార్మిక కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు. సహాయం చేయకపోతే పర్వాలేదు కానీ ఆపదలో ఉన్నవారికి కనీసం మానవత్వం కూడా చూపలేని దుస్థితిలో అధికారులు ఉండటం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీతాలు తీసుకుంటూ పని చేయకుండా బలాదూర్‌గా తిరిగే వారిని ఏమీ ప్రశ్నించడం లేదని అడిగారు. ఘర్షణ కేసుల్లో ఉండి నెలల తరబడి వారు ఉద్యోగాలకు రాకపోయినా కోర్టు కేసులు ఉన్న వారికి కూడా హాయిగా విధులకు హాజరైనట్టు అటెండెన్స్‌ వేస్తున్నారని ఆరోపించారు. వర్కర్‌ ఆసుపత్రిలో ఉన్న సమాచారం తెలిసి కూడా వారి కడుపు కొట్టే విధంగా వ్యవహరించటం అధికారుల స్థాయికి తగదని మండిపడ్డారు. కరోనా సమయంలో ఒక్కడే సంగమేష్‌ నగర్‌ ట్యాంకులో విధులు నిర్వహించారని మరొక వర్కర్‌ ను కేటాయించాలని కోరిన అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇటీవలనే అక్కడ వర్కర్‌ ను కేటాయించటం జరిగిందన్నారు. నిబద్ధతతో మూడున్నర ఏండ్లు మరొక వర్కర్‌ లేకున్నా ఒక్కడే తాగు నీటి సమస్య తలెత్తకుండా విధులు నిర్వహించిన నిబద్ధత కలిగిన వర్కర్‌ గోపాల్‌ రెడ్డి అని వారు తెలిపారు. కార్పొరేషన్‌ లో నెలల తరబడి విధులకు హాజరుకాకుండా వారికి అటెండెన్స్‌ వేయడం జరుగుతుందని, అలాంటి వారికి జీతాలు ఆపారా, అటెండెన్స్‌ రిజిస్టర్లో ఆబ్సెంట్‌ మార్క్‌ వేశారా అని వారు నిలదీశారు. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో వాటర్‌ వర్క్స్‌ డిఈఈ సుభాష్‌ అక్కడికి చేరుకొని కార్మికులకు సర్ది చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్‌ రెడ్డికి పది రోజులకు హాజరు వేయటంతో కార్మికులు శాంతించారు. వారి నిరసన కార్యక్రమం విరమించారు. అయితే టాప్‌ ఇన్స్పెక్టర్‌ మహబూబ్‌ బాషా మాత్రం చాలాసార్లు ఇదేవిధంగా కార్మికులను ఇబ్బంది పెడుతుంటే అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై కార్మికులు అసంతఅప్తిని వ్యక్తం చేశారు.