- తొమ్మిది రోజులుగా సొరంగంలోనే
- 41 మంది కార్మికులు
- పనిచేయని డబుల్ ఇంజిన్ సర్కారు
- పట్టించుకోని మీడియా
- రెండురోజులుగా నిలిచిపోయిన వెలికితీత పనులు
- ఆశలు వదులుకుంటున్న బంధువులు
డెహ్రాడూన్ : వారు కార్మికులు...రెక్కాడితే కాని డొక్కాడని కష్టజీవులు. పొట్ట నింపుకోవడం ఎంతటి కష్టానికైనా వెనుతీయని శ్రమజీవులు! ఒకరు ఇద్దరుకాదు...41 మంది! ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కుప్పకూలిన సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకుపోయి నేటికి (సోమవారానికి) తొమ్మిది రోజులు! అప్పటి నుండి నేటి వరకు మృత్యువుతో అంతులేని పోరాటం చేస్తున్నారు. సహాయచర్యలు నత్తనడకన సాగుతుండటంతో మరెన్ని రోజులు ఈ పోరాటం చేయాల్సివస్తుందో తెలియని స్థితి! దీంతో టన్నెల్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వారి బంధుమిత్రులు ఆశలు వదులుకుంటున్నారు !
అక్కడున్నది డబుల్ ఇంజిన్ సర్కారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తామే అధికారంలో ఉంటే అద్భుతాలు సృష్టిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షాలు దేశమంతా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ డబుల్ ఇంజిన్ సర్కారే కార్మికులను వెలికితీసే విషయంలో నత్త నడకన సాగుతోంది. ఏం చేయాలో తెలియక రెండు రోజుల నుండి వెలికితీత పనులు సైతం నిలిపివేసింది. ఆదివారం ప్రారంభమవుతాయని భావించినా అరకొరా తప్ప పెద్దగా ముందుకు సాగింది లేదు. ప్రత్యామ్నాయ ప్రణాళికల గురించే అధికారులు ఆలోచిస్తున్నారు. ఆ ప్రణాళికలను సక్రమంగా అమలు చేసినా కార్మికులను వెలికితీయడానికి మనో నాలుగైదు రోజులు పడుతుందని అంచనా! ఇటువంటి ఉపద్రవాలు చోటుచేసుకున్నపుడు అవసరమైన సాంకేతికత, నిపుణుల కోసం అనేక దేశాలు అంతర్జాతీయ సాయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి, హోంమంత్రిలు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగమైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ఎనిమిదవరోజైన ఆదివారం పిఎంఓ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో పాటు కొందరు పిఎంఓ కార్యాలయ అధికారుల పర్యటన తప్ప ఆదివారం కొత్తగా పడిన మిగతా 5లో ముందడుగేమి లేదు. దేశంలోని అత్యున్నత సాంకేతికతను, అందుబాటులో ఉన్న నిపుణులను అక్కడికి తరలించారా అంటే, ఆ చర్యలు నామమాత్రమే! ఆదివారం నాడు కూడా అధికారుల తర్జన భర్జనలే దీనికి నిదర్శనం. ఇటువంటి సంఘటనలు ప్రపంచంలో ఏ మూల జరిగినా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించే కార్పొరేట్ మీడియా ఉత్తరాఖండ్ సంఘటనను మాత్రం చూసీచూడనట్లు వదిలేసింది. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటమే మీడియా పట్టించుకుపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏం జరిగింది...?
ఈ నెల 12వ తేది సొరంగ నిర్మాణ పనులు జరుగుతుండగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సొరంగం కొంత మేర కూలిపోయింది. సొరంగ పనులు నిర్వహిస్తున్న 41 మంది కార్మికులు ఆ శిధిలాల కింద చిక్కుకుపోయారు. సొరంగ ప్రవేశ మార్గానికి 200 మీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది.
కొలిక్కిరాని యత్నాలు..
చిక్కుకుపోయిన వారిని త్వరగానే కాపాడగలుగుతామని తొలుత అధికారులు భావించారు. అయితే రోజులు గడిచే కొద్ది పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇప్పటివరకు 24 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు. అయితే, కార్మికులు తప్పించడానికి 60 మీటర్ల మేర డ్రిల్ చేయాల్సిఉంటుందని అంచనా! అయితే, ఈ ప్రక్రియ ఆశించినంత వేగంగా సాగడం లేదు. డ్రిల్ చేసే కొద్ది సొరంగం కుప్పకూలుతోంది. దీంతో పనులు నిలిపివేశారు. ఒక పైపును ఏర్పాటు చేసి దానిద్వారా చిక్కుకున్న కార్మికులకు ఆహారం, నీటిని అందచేస్తున్నారు. దీని ద్వారానే కార్మికులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. కార్మికులు నీరసించిపోయారని, కొందరు అసలు మాట్లాడటం లేదని వారితో మాట్లాడుతున్న అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం నిలిచిన సహాయ పనులు
అమెరికాకు చెందిన ఆగర్ డ్రిల్లింగ్ యంత్రంతో శుక్రవారం ఐదో పైపును అమరుస్తున్న సమయంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. పెద్ద శబ్దం కూడా విన్పించింది. యంత్రం ప్రకంపనల కారణంగా సొరంగం పైభాగం నుండి శిథిలాలు పడి ఉంటాయన్న అనుమానంతో పనులు నిలిపేశారు. ఆదివారం నాడు కూడా ఇదేస్థితి కొనసాగింది. కొండ పై భాగం నుండి కార్మికులు ఉన్న చోటుకు నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. ముందుగా కొండ పైభాగంలో రంధ్రాన్ని చేస్తారు.అయితే కొండ పైకి డ్రిల్లింగ్ యంత్రాన్ని చేర్చడానికి రెండు, మూడు రోజులు సమయం పడుతుందని అంచనా. అందుకోసం రోడ్డును కూడా నిర్మించాల్సి ఉంటుంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి బోయింగ్ రవాణా విమానం ద్వారా మరో డ్రిల్లింగ్ యంత్రాన్ని తీసుకొచ్చి, విడిభాగాలను కలిపే పనిలో ఉన్నారు.
నమ్మకం పోతోంది : బాధితుని సోదరుడు
తమను బయటకు తీసుకువస్తారన్న నమ్మకాన్ని కార్మికులు కోల్పోతున్నారని బీహార్‌కు చెందిన శర్మ అనే వ్యక్తి చెప్పారు. ఆయన సోదరుడు సొరంగం కింద చిక్కుకుపోయాడు. ఈ విషయం తెలియడంతో బీహార్ నుండి వచ్చిన ఆయన అధికారులు ఏర్పాటు చేసిన పైపు ద్వారా తన సోదరుడితో మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'మేము బయటకు వస్తామా అని నా సోదరుడు అడిగాడు. నేనేమి జవాబు చెప్పలేదు.' అని అన్నారు. శుక్రవారం రాత్రి నుండి సహాయక చర్యలేవీ జరగడం లేదని ఓ కార్మికుడి తండ్రి సుఖ్‌రామ్ తెలిపారు. 'నేను గురువారం రాత్రి నుండి ఇక్కడే ఉన్నాను. శుక్రవారం రాత్రి పది గంటలకు యంత్రాలన్నీ ఆగిపోయాయి. అప్పటి నుండి సహాయ సిబ్బంది ఖాళీగానే కూర్చున్నారు' అని ఆయన అన్నారు. సొరంగంలో ఉన్న కార్మికుల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉండవచ్చునని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. లోపల ఉన్న వారి మాటలు చాలా బలహీనంగా, పేలవంగా ఉంటున్నాయని అక్కడికి చేరిన వారు చెబుతున్నారు.