Jan 24,2021 06:37

ఢిల్లీ సరిహద్దులలో గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా సుమారు రెండు నెలల నుండి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది రైతులు చేస్తున్న పోరాటం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. ఈ మూడు చట్టాలే కాదు, ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ చట్టం కూడా వారికి సమ్మతంగా లేదు.


ఎం. ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ లోని ముఖ్య సిఫార్సులైన కనీస మద్దతు ధర, పెట్టుబడిపై యాభై శాతం లాభం వంటి అంశాలే నేడు రైతు ఉద్యమ లక్ష్యాలయ్యాయి. మోడీ 2014లో అధికారం చేపట్టిన తరువాత రైతులకు పెట్టుబడిపై యాభై శాతం లాభం వాచ్చే విధానాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూటే అయ్యింది. 2016 వచ్చే సరికి...లాభం సంగతి అటుంచి కనీస మద్దతు ధరను అమలు చేయటం కూడా క్రమంగా నీరు గార్చారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరను అమలు చేసిన రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పథకం ప్రకారం కనీస మద్దతు ధరను అమలు చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తగ్గించటం, వున్న కేంద్రాలలో సైతం కొనుగోళ్లు సరిగా చేయకపోవటం వెనుక గల ప్రయోజనం ఏమిటి? ఇది ఒక ఎత్తైతే కోవిడ్‌ మహమ్మారి వేళ హడావిడిగా చట్టాలు చేయటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
 

అసలు ఉద్దేశం
చిల్లర వర్తకంలో సాధించగలిగే అధిక లాభాలు బడా పెట్టుబడిదారులకు ఎప్పుడూ నోరూరించే విషయమే. 1991 నుండి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వచ్చిన క్రమానుగత మార్పులు...2007 నాటికి బడా కార్పొరేట్ల దృష్టి చిల్లర వర్తకంపై పడేటట్లు చేసింది. అయితే చిల్లర వర్తకంలో అమ్మే వస్తువులను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పారిశ్రామిక ఉత్పత్తులు, రెండు వ్యవసాయ ఉత్పత్తులు. పారిశ్రామిక ఉత్పత్తులను టోకున చవక ధరకు కొనవచ్చు. అధిక ధరలకు అమ్మవచ్చు. బడా కార్పొరేట్లకు వచ్చిన చిక్కంతా వ్యవసాయ ఉత్పత్తులతోనే. ముందే చెప్పినట్లు 2007 నుండే అంబానీలు, టాటా, బిర్లాలతో పాటు రహేజా గ్రూపు, ఆర్‌పిజి గ్రూపు, ఫ్యూచర్‌ గ్రూపు కూడా చిల్లర వర్తకం లోకి పెద్దఎత్తున ప్రవేశించాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తుల వ్యాపారంలో ఆర్జించినట్టుగానే పెద్దఎత్తున లాభాలు ఆర్జించవచ్చునని వాటికి ఆశ కలిగింది. అయితే ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా కలిగే లాభాలు కిరాణా సరుకుల నుండి కూడా లభించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను పెద్దమొత్తంలో చవక ధరకు కొనటం వీలయితే తప్ప సాధ్యం కాదు. అందువల్ల ఆచరణలో చాలా గ్రూపులు చిల్లర వర్తకంలో విఫలం చెందాయి. అందువల్లనే ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల నుండి ఆర్జించిన కొద్దిపాటి లాభాలతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలు దివాళా తీశాయి కూడా. ఫ్యూచర్‌ గ్రూపు తన వాటాను మే 2012లో ఆదిత్య బిర్లా గ్రూపుకు అమ్ముకోవాల్సి వచ్చింది.


చిల్లర వర్తకం లోకి ప్రవేశించిన బడా కార్పొరేట్‌ శక్తులు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తెలుసుకున్నాయి. పండించిన పంటలను అతి తక్కువ ధరలకు కొనాలంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసి లే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధరల వల్ల చిల్లర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాలు రావటంలేదు. కనుక చేయాల్సింది ఏమిటి?


ఎపిఎంసి లను నిర్వీర్యం చేయటమే. అధికారికంగా ప్రభుత్వపరంగా అమలవుతున్న ఎపిఎంసి ల ద్వారా కొనుగోళ్లను నిలిపివేయటం, లేదా నిర్వీర్యం చేయటం చేయకుండా చిల్లర వర్తకం లోకి బడా కార్పొరేట్ల ప్రవేశం లాభసాటి కానేరదు. ఇలా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే తక్షణ ఫలితంగా జరిగేదేమిటంటే సాధారణ రైతులకు వ్యవసాయం భారమౌతుంది. భారత దేశంలో సుమారు 80 శాతం రైతులవి చిన్న కమతాలే. ఇలాంటి వారికి ఎంఎస్‌పి అనేదే లేకపోతె వ్యవసాయం ఎంతమాత్రం జరుగుబాటు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ భూమిని సాగు చేసుకోవటం కంటే ఎవరికైనా కౌలుకు ఇవ్వటం మేలనే ఆలోచన రాకమానదు. ఈ పర్యవసానాన్ని గ్రహించి చేసిందే మొదటి వ్యవసాయ చట్టం. ఈ అవసరాన్ని తీర్చటం కోసం, కార్పొరేట్లు అలాంటి భూములను కాంట్రాక్టు పద్ధతిలో చేజిక్కించుకోవటం కోసం ఉద్దేశించబడిందే ఈ చట్టం. ఇక ఇలా ఎపిఎంసి లను రద్దు చేయటం ద్వారా మిగిలే సొమ్మును వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నందుకు కార్పొరేట్లకు రుణంగా ఇవ్వవచ్చు. రెండవ ఫలితంగా రైతులకు చేసే రుణ మాఫీ సొమ్మును కూడా పరిశ్రమలను స్థాపించినందుకు ఇచ్చినట్లుగానే...కార్పొరేట్‌ సాగుకు కూడా ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందవచ్చు.


ఇక కార్పొరేట్లు అన్నాక వారికి సరుకులు అమ్ముకునే దుకాణాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటేనే లాభం. మరి తాము కాంట్రాక్టు సేద్యం ద్వారా పండించిన పంట ఒక చోటి నుండి మరో చోటికి (మరో అవుట్లెట్‌కు) చేరవేయాలంటే రైతులు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చనే సౌకర్యం చాలా ముఖ్యమైన అవసరంగా మారుతుంది. దీనికోసం చేసిందే రెండో వ్యవసాయ చట్టం. ఇలా నేరుగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పటం కోసం చేసినవే మొదటి రెండు కొత్త చట్టాలు. అయితే కేవలం వ్యవసాయదారులు గాక వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, దళితులూ ఉద్యమంలో పాల్గొనటానికి కారణం ఏమిటి? నిజానికి గుంట భూమి లేని నిరుపేదలకు కూడా ఈ వ్యవసాయ చట్టాలతో పెద్ద నష్టమే జరగబోతున్నది.


మొదటి రెండు చట్టాల వల్ల కార్పొరేట్లకు కలిగే ప్రయోజనం, తాము కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా పండించిన పంటలను తమ రిటైల్‌ దుకాణాల్లో అమ్ముకోవటంతోనే పరిపూర్ణం అవుతుంది. అంటే వారి రిటైల్‌ దుకాణాల్లో అమ్ముకోవటానికి కావాల్సిన సరుకులను ఎంతైనా నిల్వ చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కార్పొరేట్ల దుకాణాలలో సరుకుల కొరత ఉండకూడదంటే వారి గోదాములు ఎప్పుడూ నిండుగా ఉండాలి. సరిగ్గా అందుకోసం రూపొందించిందే మూడవ నిత్యావసర సరుకుల సవరణ చట్టం.
 

అగ్ర తాంబూలం అదానీకే
ఈ మూడు చట్టాల పర్యవసానాలు ఇలాగే ఉంటాయనుకోవటానికి బలాన్ని చేకూర్చే ఉదాహరణలున్నాయి. ఈ మూడు ఆర్డినెన్సులు చేసిన జూన్‌ 2020కి నెల ముందు దేశం మొత్తం లాక్‌డౌన్‌ లో మునిగి వున్నప్పుడు సంగతి. అదానీ గ్రూపుకు చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సుమారు 75,000 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 22 ఎకరాల భూమిని వాణిజ్య పరంగా వాడుకోవటంకోసం అనుమతించింది. హర్యానా రాష్ట్రపు డైరెక్టరేట్‌ అఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుండి అనుమతి పొందిందే తడవుగా అదానీ గ్రూపు అక్కడ గోదాముల నిర్మాణం చేపట్టింది. ఈ చట్టాల వల్ల జరగబోయే నష్టం పంజాబ్‌, హర్యానా రైతులకు తెలిసింది అందువల్లనే. భూములన్నీ, పంటలన్నీ కార్పొరేట్ల పరమైతే ప్రమాదమని, ఆహార భద్రత కూడా ఉండదని అక్కడి రైతు సంఘాల నాయకత్వం కలిగించిన చైతన్యం వల్ల వారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. నిజానికి కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒకే ఒక మంచి పని ఏదైనా ఉన్నదంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు తిండిగింజలు ఇవ్వటమే. ఎపిఎంసి ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు, నిల్వ చేయటం వల్లనే ఇది సాధ్యం అయింది. మరి ఎపిఎంసి లు అనేవే లేకపోతే ఆహార భద్రత ఎలా అమలౌతుంది. ఈ విషయాన్ని తెలియజెప్పటం వల్లనే నిరుపేదలు, రైతు కూలీలు సైతం ఆందోళనలో పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. అంతే కాదు. హర్యానా లోని పానిపట్‌ జిల్లాలోని ఇస్రానా తాలూకా నాథుల, జోందా గ్రామాల్లో పైన చెప్పిన గోదాముల నిర్మాణం కోసం 2017 లోనే ఎకరాకు రూ. 30 లక్షల నుండి 2 కోట్ల దాకా చెల్లించి 22 ఎకరాల భూమిని అదానీ గ్రూపు కొనటం ఇప్పుడు వారి కనువిప్పుకు కారణమైంది. అయినా ఈ గోదాములు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం కాదని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నది అదానీ గ్రూపు.


'పంజాబ్‌ స్టేట్‌ ఫార్మర్స్‌ కమిషన్‌' సంస్థ 2008లో చేపట్టిన అధ్యయనం ప్రకారం 89 శాతం కమతాలు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాయి. వ్యవసాయ రంగంలో సబ్సిడీలను ఎత్తివేయాలని, ప్రభుత్వం మద్దతు ధరలిచ్చి తిండిగింజలు కొనకూడదని డబ్ల్యుటిఓ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన అనుభవం పంజాబ్‌, హర్యానా రైతులకు ఉన్నది. అందుకే వారు ఇప్పుడు రెండు రాష్ట్రాల రైతులనే కాదు మొత్తం దేశాన్నే మేల్కొలుపుతున్నారు. దేశాన్ని తెగనమ్ముతున్న 'దేశభక్త' పాలకుల అసలు రంగును బయట పెడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో సమర భేరి మోగిస్తున్న రైతుబిడ్డలే దేశానికి దిక్కు.
                                                                  * టి. హరికృష్ణ (సెల్‌ : 94940 37288)