అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ 70 రోజులుగా రైతాంగం చేస్తున్న పోరాటాల తరపున నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులకు రైతుసంఘాల సమన్వయ సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సమితి నాయకులు వడ్డే.శోభనాద్రీశ్వరరావు, వై.కేశవరావు, కెవివి ప్రసాద్, జమలయ్య, వి.వెంకటేశ్వర్లు, కె.కోటిరెడ్డి సంయుక్తంగా వీరికి బహిరంగ లేఖను సోమవారం రాశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్ర రైతాంగం కూడా సంఘీభావంగా పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇటీవల ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభల్లో 16ప్రతిపక్ష పార్టీల ఎంపిలు రైతాంగానికి అండగా నిలిచారని, మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి, టిడిపి ఎంపిలు రైతాంగం తరపున నోరు మెదపకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలపడం సరికాదని, వీరి వల్ల తెలుగుప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు. మన రాష్ట్రం వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రమని, భారత రైతాంగం చేస్తున్న డిమాండ్లు నెరవేరితే మన రాష్ట్రానికి ఎంతో లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విజ్ఞతను ప్రదర్శించాలని, ప్రాణాలర్పిస్తూ పోరాడుతున్న రైతాంగం తరపున నిలబడి, ఆంధ్రుల ఔన్నత్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.