సినిమా రంగమైనా, క్రీడా రంగమైనా సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు వారిని ఆరాధిస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన వారిని ఇప్పుడు ఆ అభిమానులే అసహ్యించుకునేలా ప్రవర్తించారు. ఇటీవల అంతర్జాతీయ సెలబ్రిటీలు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. వారికున్న కనీస స్పృహ కూడా లేని మనదేశ సెలబ్రిటీలు మాత్రం ఆ ట్వీట్లకు వ్యతిరేకంగా ప్రతిట్వీట్లు చేస్తూ తమ కుహనా దేశభక్తిని మరోసారి నిరూపించుకున్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుత పోరాటం చేస్తున్న రైతన్నలకు దేశ, విదేశాలలో ఎంతోమంది మద్దతు తెలుపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, సామాజిక మాధ్యామాల ద్వారా ఎవరికి తోచినవిధంగా వారు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ప్రతిస్పందన వస్తోంది. రైతన్నలకు తోడుగా ప్రపంచం యావత్తు ఒక్కతాటిపైకి వచ్చింది. దీనికి సంతోషించకపోగా... ఈ వ్యవహారం మన దేశ కుహనా దేశభక్తులకు అస్సలు మింగుడుపడడం లేదు.
మన రైతులకు మద్దతు తెలిపిన అంతర్జాతీయ సెలబ్రిటీల్లో క్రీడాకారులు, ప్రఖ్యాత గాయనీగాయకులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తగా అమెరికానే ఎదిరించి అతి చిన్న వయసులోనే ప్రపంచ ఖ్యాతిగాంచిన గ్రేటా థన్‌బర్గ్ వంటి వారు అనేకమంది ఉన్నారు. ఇంతకీ వారు చేసిన ట్వీట్ల సారాంశమేంటో ఒకసారి చూద్దాం...
* 'భారతదేశంలో ఢిల్లీ సరిహద్దు వద్ద రెండు నెలలకు పైగా నిర్విరామ పోరాటం చేస్తున్న రైతులకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను' - గ్రేటా
* 'వారి జీవనప్రమాణాలను మెరుగుపర్చుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులకు నా పూర్తి సంఘీభావం తెలుపుతున్నాను. భారతదేశం వారి ప్రాథమిక హక్కులను రక్షించాలి. ఇంటర్‌నెట్ సౌకర్యం పునరుద్ధరించాలి. అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి. దైనందిన జీవితంలో వారు స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించాలి' - అమెరికా కాంగ్రెస్ మహిళ ఇల్హన్ ఒమర్
* 'గడ్డ కట్టే చలిలో రాత్రి పగలు తేడా లేకుండా పోరాటం చేస్తున్న రైతుల వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల డాలర్లు సాయం చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను' - అమెరికా ఫుట్‌బాల్ స్టార్
* 'ప్రపంచానికి అన్నం పెట్టేది రైతులే. ప్రకృతి విపత్తులతో వారు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు. అటువంటి వారు భారతదేశంలో హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆ రైతులకు ఇప్పుడు ప్రపంచమంతా మద్దతు తెలుపుతోంది' - యు.ఎస్ వాతావరణ పరిరక్షణ కార్యకర్త జామియా మారగోలిన్
ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు మద్దతు తెలుపుతూ అంతర్జాతీయంగా అసంఖ్యాక సెలబ్రిటీలు తమ సంఘీభావం తెలిపారు. ఈ ట్వీట్లలో ఎక్కడైనా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లుగాని...దేశ ప్రజల గౌరవాన్ని కించపరిచేటట్లు గాని ఉందా... కాని మనదేశంలో ఈ ట్వీట్లే చాలామందికి కంటి మీద కునుకులేకుండా చేశాయి. ఇదేదో నేరమైనట్లు, క్షమించరాని ఘోరమైనట్లు మన మోడీ వందిమాగధ సెలబ్రిటీల నోళ్లు కాల్వగేట్లు ఎత్తినట్లు తెరిచారు. ఇప్పుడే వారికి దేశభక్తి గుర్తొచ్చింది మరి. గతంలో పాలకుల పెడ ధోరణులకు ఎంతోమంది అమాయకులు మూల్యం చెల్లించాల్సివచ్చినప్పుడు... నోట్లరద్దు, జిఎస్‌టి, పౌరసత్వ సవరణ బిల్లు, సిఎఎ వంటి అప్రజాస్వామిక విధానాలకు అసంఖ్యాక ప్రజానీకం బలైనప్పుడు వీరంతా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం వీరికి ఎక్కడలేని 'దేశభక్తి' పుట్టుకొచ్చింది. దేశ ప్రజల గౌరవం గుర్తుకొచ్చింది.
'దేశమంటే మట్టి కాదోరు...దేశమంటే మనుషులోరు' అన్నట్లు ప్రవర్తించే బాపతు కాదు వీరు. పాలకుల కుయుక్తులకు వంత పాడుతూ ప్రజాప్రయోజనాలకు తిలోదకాలివ్వడమే 'దేశభక్తి' అనే ముసుగులో తలదాచుకున్నారు. అన్నం పెట్టే రైతన్నలు నెలల తరబడి కొంపగోడు వదిలి రాత్రనక పగలనకా అహోరాత్రులు పోరాటం చేస్తుంటే ఉగ్రవాదులని ఒకరు.. ఖలిస్తాన్‌లని మరొకరు బురదజల్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
ఇవేమీ చాలవన్నట్లు ఇప్పుడు అంతర్జాతీయ సెలబ్రిటీలకు సంఘీభావంగా ఆయా దేశాల ప్రజలు కూడా భారత రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్న వేళ మన దేశ ప్రఖ్యాత క్రికెటర్లు, నటీనటులు, మధుర గాయనీగాయకులు ఆ ట్వీట్లకు వ్యతిరేకంగా ప్రతి ట్వీట్లు చేస్తూ మోడీ భజనబృందంలో చేరిపోయారు. ఇంతకు ముందెప్పుడూ ఈ గొంతుకలు పెగల్లేదేం? అసలు ఆ హక్కు వీరికెక్కడిది? పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి సచిన్ టెండుల్కర్ పార్లమెంటుకు హాజరైంది చాలా తక్కువ రోజులు. అప్పుడు కూడా ఈ దేశ ప్రజల తరపున ఆయన ఒక్కమాట మాట్లాడింది లేదు. ఇక గాయనిగా అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్న లతామంగేష్కర్ తన సుమధుర గాత్రంతో మోడీ పాటే పాడారు. బాలీవుడ్ నటి కంగనా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రైతుల పోరాటం మొదలైనప్పటి నుంచి వారికి మద్దతు తెలుపుతున్న గాయకులకు, నటీనటులకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేస్తూనే ఉంది. తమ హక్కుల కోసం శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై అవాకులుచెవాకులు పేల్చుతూనే ఉంది. అయితే ఇక్కడే ఆశ్చర్యకరంగా ఒక విషయం మనం ప్రస్తావించుకోవాలి. గతంలో ఎప్పుడూ ఏ విషయంపైనా స్పందించని ఈ సెలబ్రిటీలు ఇప్పుడే రైతుల పోరాటానికి వ్యతిరేకంగా బిజెపికి మద్దతుగా మాట్లాడుతున్నారేంటి? దీని వెనుకున్న కుట్ర కోణమేంటి? అనే ఆలోచనతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ట్వీట్లపై దర్యాప్తు చేపట్టింది. అయినా ఈ 'దేశభక్తు'ల వెనకుండి నడిపించేదెవరో బహిరంగ రహస్యమే.