Feb 08,2021 20:47

దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 75 రోజులకు పైగా రైతన్నల దీక్ష కొనసాగుతోంది. దేశవిదేశాల నుంచి అసంఖ్యాక ప్రజానీకం వారికి మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌లో వివాహం చేసుకునే జంటలు తమ ప్రాంత రైతులకు వినూత్నరీతిలో మద్దతు తెలుపుతున్నారు. పెళ్లితంతులో భాగంగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా తమ సంఘీభావం తెలుపుతున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు...


హర్యానాకు చెందిన కైథాల్‌ వాసి ఇటీవల తన పెళ్లి శుభలేక మీద 'నో ఫార్మర్‌-నో ఫుడ్‌' నినాదాన్ని ప్రింట్‌ చేశాడు. ఫిబ్రవరి 20న అతని పెళ్లి నిశ్చయమైంది. నినాదాలతో పాటు అతను ఎంతో అభిమానించే రైతు నాయకుడు చోటూ రామ్‌, విప్లవ నాయకుడు భగత్‌సింగ్‌ ఫొటోలను కూడా కార్డు మీద ముద్రించాడు. 'నేను ఢిల్లీ వెళ్లి వాళ్లకు ప్రత్యక్షంగా మద్దతు తెలపలేక పోయాను. కనీసం ఇలాగైనా నా సంఘీభావం చెప్పాలనుకున్నాను. ఈవిధంగా చేయడం వలన వారు చేస్తున్న పోరాటం గురించి తెలియని వారికి కూడా వారి స్వరం చేరుతుంది' అంటాడు ఆ వరుడు.


'రైతులు పంటలు పండించకపోతే మనకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్లు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే ఈ పనిచేశాం. ఈ నినాదంతో 300 శుభలేఖలు కొట్టించాం' అంటాడు వరుడి తండ్రి. ఇంకా ఉత్తరాఖండ్‌లో ఓ సిక్కు జంట కూడా ఈవిధంగానే తమ సంఘీభావం తెలిపారు. ఇంటి నుంచి పెళ్లి వేడుకకు కారులో కాకుండా ట్రాక్టరులో బయలుదేరడమే కాక, పెళ్లి మండపంలో రైతులకు మద్దతుగా గీతాలాపనలు చేశారు. అక్కడికి హాజరైన అతిథులు కూడా వీరితో పాటు గొంతుకలిపారు. అలా ఆ వివాహ ప్రాంగణమంతా రైతు నినాదాలు, గీతాలాపనలతో నిండిపోయింది. అలాగే అంతకుముందే హర్యానా కర్నాల్‌కు చెందిన ఓ వరుడు పెళ్లికి బుక్‌చేసుకున్న ఫ్యాన్సీ కారులో కాకుండా రైతులకు మద్దతుగా ట్రాక్టరులో వివాహానికి హాజరయ్యాడు. మొన్నీమధ్యే పంజాబ్‌కు చెందిన ఓ పెళ్లి జంట పెళ్లికి వచ్చిన అతిధులను వివాహా కానుకలకు బదులు 'రైతులకు సాయం చేయండి' అంటూ వివాహ మండపాన ఓ పెద్ద బాక్స్‌ను పెట్టారు. ఇటువంటి దృశ్యాలు ఆ ప్రాంతంలోనే కాక దేశం మొత్తంమీద జరుగుతూనే ఉన్నాయి. వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే.. రైతన్నలకు మద్దతుగా నిలుస్తున్న ఈ యువజంటలు నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. ఈ స్ఫూర్తి ఎంతోమందికి ఆదర్శంగా నిలవనుంది. అందుకే ఢిల్లీ వరకూ వెళ్లలేని మనమూ అందాం 'జై జవాన్‌..' నినాదాన్ని మరింత బిగ్గరగా....