Feb 08,2021 19:30

కాలిఫోర్నియా : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం అంతర్జాతీయ స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. దీనికి ఇటీవల జరిగుతున్న కొన్ని సంఘటనలే ఉదాహరణగా చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితం పాప్‌ సింగర్‌ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థున్‌బర్గ్‌, ఇతర దేశాల నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. తాజాగా పది కోట్ల మంది వీక్షిస్తున్న ఓ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ రైతుల ఆందోళనకు సంబంధించి ప్రకటనను ప్రసారం చేసింది. 'రైతులకు అండగా ఉందాం' అంటూ ఆ ప్రకటన పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలో జాతీయ ఫుట్‌బాల్‌ వార్షిక చాంపియన్‌షిప్‌లో భాగంగా కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో సిటీలో ఈనెల 7న 'సూపర్‌ బౌల్‌-2021' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించిన ప్రకటన 30 సెకన్ల పాటు ప్రసారమైంది. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మాటలతో ప్రారంభమైన ఈ ప్రకటనలో చరిత్రలో సుదీర్ఘమైన పోరాటంగా రైతుల ఉద్యమాన్ని పేర్కొన్నారు. 'రైతులు లేకుంటే తిండి లేదు. భవిష్యత్‌ ఉండదు. రైతులకు అండగా నిలబడదాం' అనే సందేశాలు ఆ ప్రకటనలో ఉన్నాయి. కొన్ని నెలలుగా ఉద్యమంలో జరిగిన పరిణామాలను ఫొటోలు, వీడియాలతో వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘన, మృతులు, ఎంతమంది రైతులు ఉన్నారో వివరిస్తూ... ఆ యాడ్‌ కొనసాగింది.