కాలిఫోర్నియా : అమెరికాలో మరో బ్యాంక్ దివాలా తీసింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను మూసివేయనున్నట్లు సోమవారం కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ (డిఎఫ్‌పిఐ) పేర్కొంది. బ్యాంకు ఆస్తులను జెపి మోర్గాన్ కంపెనీకి అప్పగించనున్నట్లు తెలిపింది. ఇటీవల అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు దివాలా తీసిన సంగతి తెలిసిందే. రెండు నెలల వ్యవధిలోనే దివాలా తీసిన మూడవ బ్యాంకుగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నిలిచింది.
డిఎఫ్‌పిఐ నియమించిన ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎఫ్‌డిఐసి) జెపి మోర్గాన్ నుండి వచ్చిన బిడ్‌ను అంగీకరించినట్లు తెలిపింది. ఈ బ్యాంకుకు చెందిన అన్ని డిపాజిట్లు, ఆస్తులను ఇకనుండి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాకింగ్ సంస్థ జెపి మోర్గాన్ చూసుకోనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఫస్ట్ రిపబ్లిక్‌కు చెందిన ఎనిమిదిరాష్ట్రాల్లోని 84 బ్రాంచ్‌లను సోమవారం నుండి జెపి మోర్గాన్ బ్యాంక్ ఖాతాలుగా తిరిగి ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.