Oct 28,2023 12:02
  •  డెడ్ బాడీ గుర్తించిన పోలీసులు

మైనే : అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్ లో కాల్పులు జరిపి 18 మందిని చంపేసిన హంతకుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. కార్డ్ మృతదేహం లూయిస్టన్‌కు ఆగ్నేయంగా ఉన్న లిస్బన్ ఫాల్స్‌లో రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో  గుర్తించామని  మైనే పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు. నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి మైన్‌ రాష్ట్రంలోని లెవిస్‌టన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఓ రెస్టారెంట్లో, ‘టెన్‌ పిన్‌ బౌలింగ్‌’ వేదిక వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. ఘటన తర్వాత రాబర్ట్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడి వద్ద ఆయుధం ఉండటంతో.. మళ్లీ కాల్పులకు తెగబడే అవకాశముందని.. లెవిస్‌టన్‌ నుంచి లిస్బన్‌ వరకు ప్రజలు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లిస్బన్‌లో ఓ రీసైక్లింగ్‌ సెంటర్‌ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, రాబర్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? అనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ  ఘటనపై గవర్నర్ జానెట్ మిల్లిస్ మాట్లాడుతూ.. ఆ దుర్మార్గుడు మరణంతో ఇకపై ఎవరికి ముప్పు లేదని తెలిసి చాలా ఊరటగా ఉంది.. కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని మిల్లిస్ ఒక వార్తా సమావేశంలో ప్రకటించారు.