Oct 27,2023 07:52

-18 మంది మృతి - మరో 13 మందికి గాయాలు
- దుండగుడి కోసం అన్వేషణ
వాషింగ్టన్‌ : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈశాన్య రాష్ట్రమైన మైనే ప్రాంతంలో ఒక సాయుధుడు విచక్షణారాహిత్యంగా జరిపిన ఈ కాల్పుల్లో 18 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. మైనేలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ జనేట్‌ మిల్స్‌, ఎఫ్‌బిఐ అధికారి జోడి కోహెన్‌ ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మైనేలో రెండో అతిపెద్ద నగరమైన లెవిస్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.00 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు జరిపిన సాయుధుడిని రాబర్ట్‌ కార్డ్‌ (40)గా పోలీసులు గుర్తించారు. తొలుత రెస్టారెంట్‌లోకి, ఆ తర్వాత బౌలింగ్‌ అల్లేలోకి చొరబడిన దుండగుడు కనిపించినవారిపై కనిపించినట్లు విచక్షణారాహిత్యంగా తూటాల వర్షం కురిపించాడు. దీంతో రెస్టారెంట్‌లో ఏడుగురు, బౌలింగ్‌ అల్లేలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో తనువు చాలించారు. మరణించినవారిలో ఎనిమిది మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారాన్ని చేరవేశారు. మరో 10 మందిని గుర్తించాల్సివుంది. ఈ దారుణ ఘటన పట్ల అమెరికా అధ్యక్షులు జోరు బిడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నరు జానెట్‌ మిల్స్‌కు ఫోన్‌ చేసి వైట్‌ హౌస్‌ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ప్రమాదకరమైన సాయుధుడు
ఆయుధాలు ధరించిన ఈ దుండగుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా గవర్నర్‌ పేర్కొన్నారు. ఇళ్లలోనే తలదాచుకోవాలని, ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు స్థానిక ప్రజానీకాన్ని హెచ్చరించారు. దాదాపు 38000 మంది జనాభా ఉండే లెవిస్టన్‌కు దారితీసే అన్ని మార్గాలను మూసివేసి పోలీసులు, దర్యాప్తు సిబ్బంది దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఆండ్రోస్కోగ్గిన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం తాజాగా అనుమానితుడి రెండు ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. నిందితుడు ఉపయోగించిన నల్ల వాహనం కోసం లూయిస్టన్‌లో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. లెవిస్టన్‌.. ఆండ్రోస్కోగ్గిన్‌ కౌంటీలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల దూరంలో ఉంది.