కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం ... కాలిఫోర్నియాలో తూర్పు తీరానికి నైరుతి దిశలో 4 కి.మీ దూరంలో 1.5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఏమైనా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించిందా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. గురువారం, జపాన్ రాజధాని టోక్యో పరిసర ప్రాంతాలలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలామంది గాయపడ్డారనీ, స్వల్ప నష్టం కలిగినట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం టోక్యోకు ఆగ్నేయంగా ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లో ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. కానీ ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.