Dec 31,2020 12:55

తిరువనంతపురం : కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ.. కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కరోనా సంక్షోభ సమయంలో.. వ్యవసాయ రంగంలో గందరగోళం సృష్టించడంతో పాటు భయాన్ని పెంచిన ఇటువంటి పరిస్థితిని ప్రజలు భరించలేకపోతున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టాలపై రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రమే సేకరించి, నాణ్యమైన ధరలకు పంపిణీ చేసే వ్యవస్థ ఉండాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్‌లకు దోచిపెట్టేలా ఉన్నాయని అన్నారు. రైతులకు మద్దతు ధరను కల్పించే బాధ్యత నుండి తప్పించుకునేందుకు మోడీ సర్కార్‌ యత్నిస్తోందని అన్నారు. రైతుల ఆందోళన ఇదే విధంగా కొనసాగినట్లైతే.. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడే కేరళ వంటి రాష్ట్రాలు ఆకలి వైపుకు నెట్టివేయబడతాయని అన్నారు. మద్దతు ధరను కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ చట్టాలు కార్పొరేట్‌లను బలోపేతం చేస్తాయని, చిన్న వ్యాపారులను దెబ్బతీస్తాయని అన్నారు. రైతుల చారిత్రాత్మక నిరసనను పరిశీలించి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే రైతుల డిమాండును అంగీకరించాలని కేరళ అసెంబ్లీ అభ్యర్థిస్తోందని విజయన్‌ అన్నారు.