May 27,2023 10:12
  • దసరా నాటికి ఎన్నికల మ్యానిఫెస్టో : టిడిపి పొలిట్‌ బ్యూరో నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహానాడులో చర్చించాల్సిన 14 తీర్మానాలను టిడిపి పొలిట్‌ బ్యూరో ఆమోదించింది. రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో శుక్రవారం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మహానాడులో ప్రధానంగా ప్రజల సంక్షేమంపైనే ఎక్కువ చర్చిస్తామని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరోసభ్యులు కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. మహానాడు, ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు కలిపి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు నిర్వహించబోయే ఆఖరి మహానాడు అని తెలిపారు. దసరా నాటికి తమ పార్టీ పూర్తిస్థాయి ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందిస్తుందన్నారు.
           తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని వైసిపి విషప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో వైసిపి కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన అందరికీ ఇప్పుడు అందిస్తున్న వాటికంటే రెట్టింపు సంక్షేమ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో అమలు చేసిన కొన్ని పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిని తిరిగి ప్రారంభిస్తామన్నారు.
           నాలుగేళ్ల జగన్‌ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. వీరి సమస్యలపై ప్రధానంగా చర్చ ఉంటుందన్నారు. దళితులు, బిసిలపై జరుగుతున్న దాడులపై కూడా చర్చ నిర్వహిస్తామని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఆర్‌3 జోన్‌లో పేదలకు 5శాతం భూమిని కేటాయించామని, అందులో కాకుండా ఆర్‌5 జోన్‌లో ఇవ్వడానికే తాము వ్యతిరేకమన్నారు. అమరావతిని నాశనం చేయాలనే కుట్రతో ఆర్‌5 జోన్‌లో ఇళ్లు కేటాయించారని తెలిపారు. ఈ నెల 28న నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి తమ పార్టీ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు తమ పార్టీ రాజకీయ విధానాన్ని చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరిగాయని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తేస్తామన్నారు.
 

                                                                     నేడే అధ్యక్షుడి ఎన్నిక

ఈ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఆ పార్టీ నేత అశోక గజపతిరాజు ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీకి పొలిట్‌ బ్యూరో ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో కాల్వ శ్రీనివాసులు,నక్కా ఆనంద్‌బాబు, గుమ్మడి సంధ్యారాణి, ఎన్‌ఎండి ఫరూక్‌ సభ్యులుగా ఉంటారు. శనివారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం నాటికి అధ్యక్షుని ఎన్నిక పూర్తవుంది.