Nov 17,2023 11:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రగిరిలో నియోజకవర్గంలో 60 వేల దొంగ ఓట్లు వైసిపి నాయకులు చేర్చారని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఓట్లను తొలగించాలని మీనాను గురువారం సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో వైసిపి అనుకూల ప్రాంతాల్లో కొత్తగా 45 పోలింగ్‌ బూత్‌లు పెంచారని, వీటిని తొలగించి పాత పద్ధతిలోనే ఉంచాలని కోరారు. కొత్తపేట నియోజకవర్గంలో 6 వేల ఓట్లు తొలగించేందుకు ఇంగ్లీష్‌లో నోటీసులు ఇచ్చారని, వీటిని తొలగించొద్దని తెలిపారు. మీనాను కలిసిన వారిలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్‌, అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఉన్నారు.
 

                                               మహేంద్ర కేసులో ఎ-1 హోంమంత్రి : మాజీ మంత్రి జవహర్‌

తూర్పు గోదావరి జిల్లా దుమ్మేరులో బొంతు మహేంద్ర ఆత్మహత్య కేసులో హోంమంత్రి తానేటి వనితను ఎ-1 చేర్చాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఎవరు ఒత్తిడి తెస్తే అతనిని అరెస్టు చేసి వేధించారు? హోంమంత్రి ఎవరికి ఫోన్‌లు చేశారు? అనే నిజాలు తెలియాలన్నారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్‌ చేశారు. టిటిడి ఇఒ పదవికి ధర్మారెడ్డి అనర్హుడని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వైసిపి నేత సజ్జలకు లేదని టిడిపి ఎమ్మెల్యే అశోక్‌బాబు అన్నారు. ఆస్పత్రిని తప్పు పట్టే స్థాయి ఎఎజికి లేదని అన్నారు.