Jan 15,2023 16:10

గత 28 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే "శోభకృతు” నామ సంవత్సర ఉగాది(మార్చ్ 22, 2023) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నమని నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ(వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సస్) తెలిపారు.  స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి. రచనలు  అందవలసిన ఆఖరి తేదీ : మార్చి 5, 2023 
ప్రధాన విభాగం భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానించారు. 
ఉత్తమ కథానిక :  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ : రూ.9, 429
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ : రూ.9,429

  • “మొట్టమొదటి రచనా విభాగం”

భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరికొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
"నా మొట్టమొదటి కథ": (ఉత్తమ కథ): రూ. 9,429
"నా మొట్టమొదటి కవిత": (ఉత్తమ కవిత): రూ. 9,429

  • అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించవచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (ఉదా. గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే. 

  • ఈ క్రింది మెయిల్ ఐడిలకు, వాట్సప్ నెంబర్ కు పంపగలరు 

sairacha@gmail.com  &  vangurifoundation@gmail.com
వాట్సప్ : 1 832 594 9054

  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు

రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
 బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
 విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (మార్చ్ 22, 2023) కాని, అంతకు ముందు కానీ   ప్రకటించబడతాయి. కాపీ రైట్స్  ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను  రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.
అమెరికా విజేతల బహుమతులు, వీలుంటే అన్ని దేశాల విజేతల బహుమతులు ఈ సంవత్సరం జరగబోయే 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో సభా ముఖంగా అందజేయ బడి,  బహుమతి పొందిన రచనలు చదివి వినిపించే అవకాశం కల్పించబడుతుంది. అమెరికాలో ఈ సదస్సు జరిగే నగరం, తేదీలు త్వరలోనే ప్రకటించబడతాయి.
విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.