
ప్రజాశక్తి-రాజానగరం(తూర్పుగోదావరి) : వచ్చే ఏడాది జనవరి 5,6,7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు-2024 రాజానగరం సమీపంలో గైట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు కెవివి సత్యనారాయణరాజు(చైతన్య రాజు) తెలిపారు. శ్రీ రాజ రాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ధి ఉత్సవాలు ఆంధ్రా సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా ఈ అంతర్జాతీయ తెలుగు మహా సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గైట్ కళాశాలలో అంతర్జాతీయ తెలుగు మహా సభలు గోడ పత్రికను చైతన్య రాజు, గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మహా సభలకు జాతీయ అంతర్జాతీయ నాయకులు, పీఠాధిపతులు, చలనచిత్ర ప్రముఖులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెలుగు భాషలో సుమారు 25 సాహితీ ప్రక్రియలపై సదస్సులు ఉంటాయన్నారు. సుమారు 3000 మంది కవి సమ్మేళనంలో పాల్గొంటారని, 50 దేశాల నుండి ప్రముఖులు హాజరుకావాలని చెప్పారు. భారతీయ సాంస్కతిక ప్రదర్శనలు, కవులు, కళాకారులు, జానపద కళారూపాలు, కళాకారులు, హరిదాసులు, కొమ్ముదాసులు, భాషా పండితులు, వస్తారని చెప్పారు. ఒక ప్రధాన వేదిక, రెండు ఉప వేదికలు, గ్రంధాలయాలు, ఆయుర్వేద, మిల్లెట్, కొండపల్లి, లేపాక్షి, కళలు, వివిధ తెలుగు వైభవం చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిలో సాంప్రదాయ కళలతో పాటు సంచార జాతుల కళా ప్రదర్శనలు ప్రత్యేకత ఉంటుందన్నారు. 15000 వేల మందికి వీక్షించే సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దూర ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దీనికి ప్రజలందరూ సహాకారం అందించాలని కోరారు. దీనిలో పరిషత్ కార్యదర్శి రెడ్డిప్పా ధవేటి, ఉపాధ్యక్షుడు కడివెళ్ళ వారు ప్రసాద్స, సమన్వయ కర్త కేశిరాజు రామప్రసాద్, గౌరవ సలహాదారులు బాబు శ్రీ, సభ్యులు అడ్డాల వాసుదేవరావు, గైట్ కళాశాల ప్రిన్సిపాల్ టివి శర్మ తదితరులు పాల్గొన్నారు.