
చేతులాడటం లేదు
కాళ్ళు కదపటం లేదు
నూలిపోగు ఉరిపోగైనాక
ఊపిరి సలుపటంలేదు
బతుకుబండి చక్రాలు ఆగినాక
అతుకుల జీవనం సాగలేదు.
పాతాళంలో ధర
తిష్టవేసి కూర్చుండి పోయాక
గుక్కతిప్పడం చేతకాలేదు
అల్లికలన్నీ మెలికలు తిరిగి
ఎక్కడికక్కడ తెగిపోయాక
చేనేతకు చేయి తిరగలేదు.
నిలబడిపోయిన
పట్టు వస్త్రాల నడుమ
నలిగిపోయిన బతుకు లేవనేలేదు
నింగినంటిన
దారం పోగుల ధరల గుప్పిట్లో
ఇరుక్కుపోయి కూర్చున్నాక
మెతుకు ముట్టట్లేదు.
ఆగిన మగ్గాల గోతుల్లో
అరువు దెబ్బకు దాక్కున్నాక
ఒక్క పూట కూడా మింగుడు పడ్లేదు
చేనేతకు లేని చేయూతతో
అచేతనంగా మిగిలిపోయాక
పోగులతకడం లేదు.
గాలి వాటపు అమ్మకం పొదిలో
వ్యాపారం చిక్కుకున్నాక
దారపు ఉండ కరగనేలేదు
చేనేతకు చేయందించే కాలం
ఎప్పుడొస్తుందాని
కళ్ళల్లో దారం వత్తులు పోగేసి
ఎదురు చూస్తూ కూర్చున్నాం.
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్: 9666016636