Sep 24,2023 21:50

- ఆయన మరణం చేనేతకార్మిక లోకానికి తీరని లోటు
- సంస్మరణ సభలో పలువురు వక్తలు
ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ :చేనేత కార్మిక, ప్రజా సమస్యలపై పోలా రామాంజనేయులు అలుపెరుగని పోరాటాలు చేశారని పలువురు వక్తలు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు, రాంభూపాల్‌, ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ తదితరులు పాల్గన్నారు. తొలుత రామాంజనేయులు చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాంజనేయులు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశారని తెలిపారు. చేనేతల సమస్యలపై పోరాడుతూ జైలుకు కూడా వెళ్లారన్నారు. పోలా రామాంజనేయులు మృతి చేనేత కార్మిక లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, సిపిఎం, సిపిఐ, జెవివి, యుటిఎఫ్‌, రైతుసంఘం నాయకులు పాల్గన్నారు. రామాంజనేయులు చిత్రపటానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు.