Nov 17,2023 15:14

కరీంనగర్‌: ధరణి పోర్టల్‌తో అద్భుత ఫలితాలు వచ్చాయని.. దళారులు లేకుండా చేశామని బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.''ఉద్యమ సమయంలో ఆమరణదీక్షకు శ్రీకారం చుట్టింది ఇక్కడే. అలుగునూరు చౌరస్తాలో నన్ను అరెస్ట్‌ చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. అనేక ఘట్టాల్లో కరీంనగర్‌ గడ్డ ప్రథమస్థానంలో ఉంటూ అద్భుత విజయాన్ని అందించింది. తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయం రాష్ట్రం 19-20 స్థానాల్లో ఉండేది. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన తర్వాత 3.18లక్షల తలసరి ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ మనమే మొదటి స్థానంలో ఉన్నాం.రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా? రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు చేసి 80లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం. సాగునీటిపై గతంలో పన్ను ఉండేది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని రద్దుచేశాం. ధరణితో మంచి ఫలితాలు వచ్చాయి. దానివల్ల రైతులు గడప దాటకుండా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌గాంధీ అంటున్నారు. దాన్ని తీసేస్తే రైతుబీమా, రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయి? పంజాబ్‌ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ధరణిని తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది'' అని కేసీఆర్‌ విమర్శించారు.